రష్యా, ఉక్రెయిన్ ల మధ్య గత రెండు నెలలకు పైగా కొనసాగుతున్న యుద్ధంతో ప్రపంచ దేశాలతో పాటు.. ఆ రెండు దేశాల్లోనూ తీవ్రం సంక్షోభం ఏర్పడుతోంది. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితుల్లో.. ఆ 2 దేశాల్లో నిర్వహిస్తున్న ప్రాజెక్టులను భారత్ సహా ఇతర దేశాలకు తరలిస్తున్నాయి ఐటీ కంపెనీలు. ఐటీ, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు ఆ రెండు దేశాల్లోని తమ ఐటీ, ఐటీఈఎస్ కార్యకలాపాలను తాత్కాలికంగా భారత్ కు మళ్లించే అవకాశాం ఉన్నట్టు తెలుస్తోంది.
భారత్‌తో పాటు ఫిలిప్పీన్స్, బ్రెజిల్, మెక్సికో, టర్కీ దేశాలకూ ఐటీ ప్రాజెక్టులు తరలిపోతాయని.. ఫ్రాన్స్‌కు చెందిన ఐటీ కన్సల్టింగ్ సేవల సంస్థ ఆటోస్ వెల్లడించింది. రష్యాలో ఐటీ కార్యకలాపాలు కొనసాగించలేమని.. అక్కడి ప్రాజెక్టులన్నింటినీ భారత్, టర్కీకి మళ్లిస్తామని స్పష్టం చేసింది. వాటిలో ఎక్కువ ప్రాజెక్టుల్లో హైదరాబాద్‌కు చేరే అవకాశం ఉందని ఐటీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో ఐటీ ఉద్యోగాలు పెరిగే అవకాశం ఏర్పడుతోందని స్థానిక ఐటీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇంజినీరింగ్ పరిశోధన-అభివృద్ధి, డేటా ప్రాసెసింగ్, బ్యాక్ ఆఫీస్ నిర్వహణ, కస్టమర్ సపోర్ట్-మెయింటెనెన్స్, షేర్డ్ సర్వీసెస్ విభాగాల ఉద్యోగాలు ఇక్కడకు హైదరాబాద్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనివల్ల మనదేశంలో కొత్తగా 50,000-60,000 ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. యుద్ధం ముగిసినా కూడా కొన్ని ప్రాజెక్టులను సంబంధిత క్లయింట్లు మనదేశంలోనే కొనసాగించే అవకాశం ఉంటుంది.
తూర్పు ఐరోపా దేశాలైన రుమేనియా, బల్గేరియా, మాల్డోవా, పోలెండ్‌తో పాటు బెలారస్, ఈస్తోనియా, లాత్వియా, లిథుయేనియా వంటి దేశాలు తమ ఐటీ అవసరాల కోసం ఉక్రెయిన్, రష్యా దేశాల మీద అధికంగా ఆధారపడి ఉన్నాయి. అమెరికా, ఐరోపా దేశాలకు చెందిన ఐటీ కంపెనీలు కూడా రష్యా, ఉక్రెయిన్‌లలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. యుద్ధ పరిణామాల్లో ఈ కంపెనీలు తమ కార్యకలాపాలను అక్కడ సజావుగా నిర్వహించలేని పరిస్థితి తలెత్తింది. అందుకే ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నాయని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొన్ని ప్రాజెక్టులు వచ్చే 6 నెలల వ్యవధిలో మనదేశానికి వస్తాయని స్థానిక ఐటీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.