ప్రధాని మోడీపై బీబీసీ రూపొందించిన వివాదాస్పద డాక్యుమెంటరీ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీ, ముంబైలలోని బీబీసీ కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల సందర్భంగా సిబ్బంది మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని.. వారిని ఇళ్లకు వెళ్లిపోవలసిందిగా కోరినట్టు తెలుస్తోంది. ముంబై లోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ లోని కార్యాలయం..అంతర్జాతీయ పన్నుల విధానాన్నిఅడ్డు పెట్టుకుని పలు అవకతవలకు పాల్పడిందని, ట్రాన్స్ ఫర్ ప్రైసింగ్ లో కూడా ఫ్రాడ్ కు దిగిందని వచ్చిన ఆరోపణలను పురస్కరించుకుని ఈ దాడులు జరిగినట్టు భావిస్తున్నారు.
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ దీనిపై ట్వీట్ చేస్తూ.. మొదట బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించారని, ఇప్పుడు ఐటీ అధికారులు బీబీసీ ఆఫీసులపై దాడులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇది అప్రకటిత ఎమర్జెన్సీ అని అభివర్ణించారు.
అదానీ వివాదంపై జేపీసీ చేత దర్యాప్తు జరిపించాలని తాము డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం బీబీసీవెంట పడిందని ఆయన వ్యాఖ్యానించారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా కూడా ఇలాగే స్పందించారు. ఇది తాము ఊహించలేదని, సెబీ ఆఫీసులో ఆ సంస్థ చైర్మన్ తో అదానీ చిట్ చాట్ కి కూర్చున్నప్పుడు ఈ దాడులు జరగడం విశేషమన్నారు.
బీబీసీ కార్యాలయాలు పన్నులు చెల్లించకుండా ఎగవేశాయని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఐటీ శాఖ హఠాత్తుగా రెయిడ్స్ కి పూనుకొన్నట్టు తెలుస్తోంది. ఈ ఆఫీసుల నుంచి అధికారులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.