ఎంతోకాలంగా కనపడని మెఘా అక్రమాలు ఇప్పుడే ఎందుకు బయటపడ్డాయి? తెలుగునాట మీడియా ఛానళ్లన్నింటినీ గంపగుత్తగా కొనేసి జర్నలిస్టుల్ని గుమ్మానికి కట్టేయాలని మెఘా కృష్ణారెడ్డి ఆ మధ్య చేసిన ఛాలెంజ్ కొంపముంచిందా? ముఖ్యంగా టీవీ9 కొనుగోలు అంశమే ఐటీ దృష్టిలో పడటానికి కారణమా..? తీగలాగితే డొంక కదులుతోందా ? అందుకే డిల్లీ బృందాలు జల్లెడ పడుతున్నాయా…?
ప్రభుత్వాలతో ఎలా సన్నిహితంగా ఉండాలో మెఘాకు తెలిసినంత మరెవరికీ తెలియదు. ఇది అతనికి వైఎస్ హయాం నుంచే ఆలవాటైన విద్య. చంద్రబాబు కానీ, జగన్ కానీ, వైఎస్ కానీ, కేసీఆర్ కానీ.. ప్రభుత్వాలేవైనా కానీ, మెఘా గుత్తాధిపత్యం మారలేదు. పైపెచ్చు మరింత పెరిగింది. ఎంతలా అంటే ప్రభుత్వం నుంచి వచ్చిన డిజైన్లు మార్చి రీడిజైన్లు చేసేంత.
ఇక మెఘాతో కేసీఆర్, జగన్ సాన్నిహిత్యం గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అయితే, ఇంతలా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకొని, అన్ని పార్టీలతో సత్సంబంధాలు కలిగిన మెఘాపై ఐటీ దాడులు ఎవరూ ఊహించలేదు. ఈ దాడులు ఒక్కరోజుతో సరిపోయే దాడులు కూడా కావు. కేంద్ర బలగాల మధ్య వరుసగా మూడు రోజులు కొనసాగుతాయని చెబుతున్న దాడులు.
ఈ దాడులకు అసలు కారణం అలంద మీడియా కంపెనీ అని అనుకుంటున్నారు. యస్, ఇటీవల టీవీనైన్ సంస్థను కొనుగోలు చేసింది మెఘా, ఆయన సన్నిహితుడు మైహోం రామేశ్వరరావు. ఈ కొనుగోలు అంశంలో అధికారిక లెక్కలు చూపినవి రూ.260 కోట్ల లోపే. కానీ అప్పటికే టీవీ9 మాతృసంస్థ మాత్రం సంవత్సరానికి 200 కోట్లు పైచిలుకు లాభాన్ని చూపించింది. సంవత్సరానికి 200కోట్లు సంపాదించే సంస్థను ఎవరైనా 260 కోట్లకు అమ్ముకుంటారా ? కానీ ఇక్కడ అమ్మారు.
ఈ పాయింట్ మీదే ఐటీ రంగంలోకి దిగినట్లు కనపడుతోంది. పైగా అప్పటికే టీవీ9 కొనుగోలు అంశాలలో 600 కోట్లు, 700 కోట్లకు బేరం నడుస్తోందని వార్తలు హల్‌చల్ చేశాయి. కొనుగోలు పూర్తికాగానే తన 15ఏళ్ల కష్టంతో నిర్మించిన టీవీ9 సంస్థ నుంచి మీడియా లెజెండ్ రవిప్రకాశ్‌ను బయటకు పంపించారు.
అధికారమే మన చేతులో ఉంది, గడ్డిపోచలా పోతాడులే అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ గడ్డిపోచే మెఘా మెడకు చుట్టుకున్నట్లు కనపడుతోంది. టీవీ9 అంశంలో ఐటీ తీగలాగితే మెఘా డొంక కదులుతోంది. ఐటీ ఇచ్చే నివేదిక ఆధారంగా మున్ముందు ఈడీ, సీబీఐ రంగంలోకి దిగబోతున్నట్లు సమాచారం.
ఇప్పటికే కేంద్ర సంస్థలు మెఘా సబ్ కాంట్రాక్టర్ల కూపీ లాగే పనిలో ఉన్నాయని, మెఘా అంశం పూర్తయ్యాక జెట్ స్పీడ్‌లో చెక్ పెట్టే కార్యక్రమం ఉండబోతుందని అంటున్నాయి కేంద్ర వర్గాలు.