– నాలుగు రోజుల పాటు సాగిన తనిఖీలు
– అనుమానాస్పద లావాదేవీలపైనే గురి
– స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అధికారులు
– విచారణ కోసం డైరెక్టర్లకు ఆహ్వానం
కొన్నాళ్లుగా రియల్ ఎస్టేట్ సంస్థలు, భవన నిర్మాణ కంపెనీలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు నిఘా పెట్టాయి. ఈ క్రమంలోనే వరుసబెట్టి తనిఖీలు చేస్తున్నాయి. అలా.. శ్రీ ఆదిత్య హోమ్స్ లో మెరుపు దాడులు చేశారు ఐటీ అధికారులు. నాలుగు రోజుల పాటు ఇవి కొనసాగాయి. శ్రీ ఆదిత్య హోమ్స్ డైరెక్టర్ల నుండి అనుమానాస్పద లావాదేవీల వివరాలపై స్టేట్మెంట్ రికార్డు చేశారు.
తనిఖీల సందర్భంగా పలు డాక్యుమెంట్స్, హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. విచారణకు తమ కార్యాలయానికి రావాల్సి ఉంటుందని డైరెక్టర్లకు చెప్పారు. 35 ప్రాంతాల్లో జరిగిన ఈ సోదాల్లో కీలక విషయాలను అధికారులు గుర్తించారు. మైత్రీ మూవీస్ కి పెద్ద ఎత్తున ఫైనాన్స్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు కొనసాగాయి. గత 5 సంవత్సరాలుగా ఆడిటింగ్ లో పెద్దఎత్తున లెక్కలు చూపించలేదని ఆధారాలు సేకరించింది ఐటీ. దీంతో వివిధ కంపెనీలతో జరిగిన లావాదేవీలపై ఆరా తీసింది.
బెంగళూరు, హైదరాబాద్ లోని నిర్మాణ సంస్థల్లో అధిక మొత్తంలో నగదు సేకరించినట్లు రిసిప్ట్స్ లభించాయి. వంశీరాం బిల్డర్స్ తో పాటు మరికొంత మంది బంధువుల అకౌంట్స్ ని చెక్ చేసినట్లు తెలుస్తోంది. సుబ్బిరామిరెడ్డి కుటుంబంతో పాటు ఇందూరి శ్యాంప్రసాద్ రెడ్డి , జీవీకే కుటుంబానికి కోటారెడ్డికి బంధుత్వం ఉంది. వివిధ కంపెనీల్లో కామన్ డైరెక్టర్స్ లెక్కలపై ఆరా తీశారు అధికారులు. ఈక్రమంలో మొత్తం 15 కంపెనీల డేటా కలెక్ట్ చేసినట్లు సమాచారం.