తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో అధికారులు సోదాలు జరుపుతున్నారు. జూబ్లీహిల్స్ లో కాంట్రాక్టర్ జనార్ధన్ రెడ్డి ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. ఇతను వంశీరాం బిల్డర్స్ సుబ్బారెడ్డి బామమరిది. అతని ఇంట్లోతో పాటు వంశీరాం బిల్డర్స్ కార్యాలయం సహా మొత్తం 36 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
వంశీరాం బిల్డర్స్ తనిఖీల్లో భాగంగా విజయవాడలోనూ సోదాలు జరుగుతున్నాయి. అధికార పార్టీ వైసీపీకి చెందిన దేవినేని అవినాష్, వల్లభనేని వంశీ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు అధికారులు. ఉదయం నుంచి ఇవి కొనసాగుతున్నాయి. పలు బృందాలుగా ఈ తనిఖీలు జరుగుతున్నాయి.
బంజారాహిల్స్ లోని తన స్థలాన్ని వంశీరాం బిల్డర్స్ కు డెవలప్ మెంట్ కు ఇచ్చారు దేవినేని అవినాష్. ఈ క్రమంలో ల్యాండ్ డెవలప్ మెంట్ అగ్రిమెంట్ డాక్యుమెంట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. వంశీరాం బిల్డర్స్, అవినాష్ కు మధ్య లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. అలాగే వల్లభనేని వంశీకి సంబంధించి డీలింగ్స్ పైనా వివరాలు తెలుసుకుంటున్నారు.
1996లో వంశీరాం బిల్డర్స్ ను స్థాపించారు సుబ్బారెడ్డి. రెండు రాష్ట్రాల్లో 80పైగా ప్రాజెక్టులు చేసింది ఈ సంస్థ. అందులో.. లగ్జరీ విల్లాలు, కమర్షియల్ ప్రాజెక్టులు ఉన్నాయి. బెంగళూరు, తిరుపతిలో సైతం వంశీరాం ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రైం ఏరియాలో భూమి కొనుగోలు, ప్రాజెక్ట్స్ చేపట్టారు సుబ్బారెడ్డి. దీంతో.. పెద్ద మొత్తంలో జరిగిన లావాదేవీలపై ఐటీ విచారణ చేస్తున్నట్లు సమాచారం.