– బీఆర్ఎస్ నేతల బినామీ కంపెనీలే టార్గెట్
– బ్లాక్ మనీ ఫ్లోటింగ్ అయినట్లు గుర్తింపు
– కీలక పత్రాలతోపాటు నగదు, బంగారం స్వాధీనం
– జీఎస్టీ, ఆడిటింగ్ రిపోర్టులపై ఆరా
– ఫార్మా, రియల్ రంగంలో వసుధ
– వర్టెక్స్ వర్మ లావాదేవీలపైనా ఐటీ ఫోకస్
– ముప్పా ప్రీ లాంచ్ సొమ్ము లెక్కలపై కూపీ
– రాజ్ పుష్ప రియల్ రంగు గుర్తింపు
క్రైంబ్యూరో, తొలివెలుగు:హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి ఏకకాలంలో నాలుగు కంపెనీలపై 50 బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. లిటిగేషన్ భూములతో భారీగా నల్లధనం పొగేసుకున్నారన్న ఆరోపణలపై ఐటీ దాడులు జరుగుతునట్లు తెలుస్తోంది. జీడిమెట్లలో ఉన్న వసుధ ఫార్మా కెమికల్స్ లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ డైరెక్టర్లు అదే పేరుతో ఫార్మా వ్యాపారంతో పాటు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వెంకటరాజు కళానిధి, ఆనంద్ మంతెన, మధుసూధన్ రాజు మంతెన, వరలక్ష్మి, శ్రీహరి వర్మ కొత్తపల్లి, పద్మనాభుని వెంకట అప్పాజీల నివాసాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. డైరెక్టర్ రాజు వసుధ ఫార్మా పేరుతో రియల్ బిజినెస్ చేస్తున్నట్లు పక్కా సమాచారం ఉండటంతో ఐటీ అధికారులు సోదాలకు దిగారు. సుమారు 15 కంపెనీల పేరుతో రియల్ బిజినెస్ చేస్తున్నట్లు సమాచారం.ఈ ఫార్మా కంపెనీకి సంబంధించిన కార్యాలయాలు, డైరెక్టర్ల, ముఖ్య అధికారుల ఇళ్లల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. వసుధ ఫార్మా కెమికల్స్ కంపెనీ జీడిమెట్లలో ఉంది. 1994లో ఈ కంపెనీని స్థాపించారు. వివిధ రకాల మెడిసిన్స్ ను తయారు చేస్తోంది. దేశ, విదేశాలకు ఎగుమతి చేస్తోంది. 1997-98లో 0.25 మిలియన్ డాలర్లతో ప్రారంభమైన ఈ వ్యాపారం 2020-21 ఆర్థిక సంవత్సరం వచ్చే సరికి 145 మిలియన్ డాలర్లకు చేరుకుంది.113 మంది శాస్త్రవేత్తలు ఈ కంపెనీలో పనిచేస్తున్నట్లు ఫ్రొఫైల్‌ను బట్టి తెలుస్తోంది. అయితే.. భారీగా భూములు ఉండటంతో డెవలప్మెంట్ చేసేందుకు ఆయా రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇచ్చినట్లు సమాచారం. ఇందులో బ్లాక్ మనీ సర్క్యూలేషన్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.
వర్టెక్స్, ముప్పా, రాజ పుష్పలో ముమ్మర సోదాలు
1994లో ఏర్పాటు చేసిన వర్టెక్స్ హోమ్స్, 2000 సంత్సరంలో కంపెనీగా ఏర్పాటు చేశారు. అనామకుడిగా వచ్చిన వర్మ 20 ఏండ్లలో వేల కోట్ల రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని సృష్టించారు. రాజకీయ నేతలకు దగ్గరగా ఉంటూ భూములను కొనుగోలు చేసి బిల్డింగులు నిర్మిస్తారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత లిటిగేషన్ భూముల్లో భారీగానే పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. చాలా ప్రాజెక్ట్స్ ను పట్టాల మీదకి ఎక్కించినట్టు సమాచారం. దీంతో టర్నోవర్ వైట్ మనీ కంటే బ్లాక్ మనీగానే భారీగా ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఐటీ అధికారులు తనీఖీలు చేపట్టారు. వీ వెంకట నారాయణ వర్మ, మురళీ మోహన్ చక్కగురు, ప్రసన్న లక్ష్మి ఇళ్లల్లో వారి ప్రైవేట్ కార్యాలయాల్లో అదాయపు పన్ను శాఖ కీలక ఫైల్స్ ని స్వాధీనం చేసుకుంది.
ముప్పా.. మూలాలపై గురి
ముప్పా అలంక్రితా, ఆరెంజ్ కంట్రీ, ఆరెంజ్ విస్ట్స్, ఆరెంజ్ మెడోస్, లహరి గ్రీన్ పార్క్, గ్రీన్ ఫీల్డ్, ముప్పా పంచవతి టౌన్ షిప్ పేరుతో అపార్ట్ మెంట్స్ నిర్మాణాలు చేపట్టారు. తెల్లాపూర్ ఉస్మాన్ నగర్ లో ముప్పాస్ మెలోడీ పేరుతో భారీ ప్రాజెక్ట్ జరుగుతోంది. విష్ణు వర్ధన్ ముప్పా, సందీప్ వర్ధన్ ముప్పా, వెంకయ్య ముప్పా, రజనీ దేవి ముప్పా, భాస్కర్ రావు ముప్పా, జయశ్రీ ముప్పా, ముప్పా అశోక్ వర్దన్ ఇండ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వీరి బంధువుల ఇళ్లనూ జల్లెడ పట్టారు.
రాజ్ పుష్ప రాజభోగాలపై ఫోకస్
సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్ రామిరెడ్డి కుటుంబానికి చెందిన రాజ్ పుష్ప ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలపై ఆదాయపు పన్నుశాఖ ఎప్పటి నుంచో గురి పెట్టింది. కోకాపేట భూముల కొనుగోళ్ల వ్యవహారంతోనే చిట్టా అందింది. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన పిదపనే దాడులు ఉంటాయని అనుకున్నా.. ఆ తర్వాత ఆయన కూతురు పెండ్లి సమయంలో నిఘా పెట్టింది ఐటీ. ఆ పెండ్లి నాడే దాడులు జరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం రావడంతో బిక్కుబిక్కుమని పెళ్లి జరిపించారని విశ్వసనీయ సమాచారం. ఆ కంపెనీ దాఖలు చేసిన జీఎస్టీ ఫైల్స్ తో ఇన్నాళ్లు కుస్తీ పట్టి ఆధారాలతో సహా దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ వెంకట్ రామిరెడ్డి సోదరుడు జయచంద్రారెడ్డి పరుపాటి, శ్రీనివాస్ రెడ్డి , మహేందర్ రెడ్డి, చరణ్ రాజ్ రెడ్డి, సుజిత్ రెడ్డిల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. వీరి కుటుంబ సభ్యులకు చెందిన రాజ్ పుష్ప ప్రైమ్స్, రాజ్ పుష్ప సిమెంట్స్ లిమిటెడ్, రాజ్ పుష్ప ట్రస్ట్ నెస్ట్ రియాల్టీ, రాజ్ పుష్ప ఎస్టేట్, రాజ్ పుష్ప కార్పొరేట్ ప్రైవేట్ లిమిటెడ్, రాజ్ పుష్ప అసెట్ మెనేజ్మెంట్ ఎల్ఎల్పీ, రాజ్ పుష్ప లాండ్ మార్క్, ఇలా అన్ని కంపెనీల లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.