హిమాచల్ ప్రదేశ్ లోని అదానీ విల్మార్ సంస్థ ఆదాయపు పన్ను ఎగ్గొట్టిందని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఐటీ, ఎక్సయిజు అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. సోలన్ లోని ఈ కంపెనీ కొన్నేళ్లుగా జీ ఎస్టీ వసూళ్లను డిపాజిట్ చేయడంలో విఫలమైందని, పలు అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అదానీ గ్రూప్ లో భాగమైన ఈ కంపెనీ ఆస్తులు అనుమానాస్పదంగా ఉన్నాయన్నారు. అయితే అధికారులు సోదాలు నిర్వహించుకోవచ్చునని, తామెలాంటి అవకతవకలకు పాల్పడలేదని ఈ సంస్థ ప్రకటించింది.
రొటీన్ గా నిర్వహించే సోదాల్లో భాగంగానే అధికారులు తమ కంపెనీని విజిట్ చేసి రికార్డులు పరిశీలించారని, వారికి అనుమానాస్పద లావాదేవీలేవీ కనబడలేదని స్పష్టం చేసింది రూల్ 86 బీ కింద జీ ఎస్టీ చెల్లింపులను నగదుగా పన్ను కింద కట్టవలసిన అవసరం లేదని ఈ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు.
అసలు దాడుల ప్రసక్తే లేదని చెప్పిన ఆయన.. ఈ విషయంలో మీడియా ..గోరంతలను కొండంతలు చేసిందన్నారు. పైగా ఎక్సయిజు అధికారులకు తాము అన్నివిధాలుగా సహకరించామన్నారు. వారి విజిట్ తరువాత తమ డిపో ఆపరేషన్లు యధావిధిగా కొనసాగాయని ఆయన చెప్పారు.
అప్పర్ సర్క్యూట్ లిమిట్ లో అదానీ విల్మార్ షేర్లు 5 శాతం మేర ఉన్నాయి. గ్రీన్ జోన్ లో ట్రేడ్ అవుతున్న పది అదానీ స్టాక్స్ లో ఇదొక్కటేనని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏది ఏమైనా హిమాచల్ లోని ఈ కంపెనీపై ఎక్సయిజు, ఐటీ అధికారుల దాడుల ఫలితంగా ఇన్వెస్టర్లలో అనిశ్చితి నెలకొంది.