బాలవికాస స్వచ్ఛంద సేవా సంస్థ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ సింగా రెడ్డి శౌరెడ్డి, ఆయన భార్య సునీతా రెడ్డి, వ్యవస్థాపక డైరెక్టర్ థెరిసా కలిసి సంస్థకు వచ్చిన కోట్లాది రూపాయల ఎఫ్ సీఆర్ఏ నిధులను దారి మళ్లించి సొంతంగా వాడుకున్నారని, భూములు ఇతర ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ సంస్థ ఆర్థిక వ్యవహారాలపై ఇన్ కమ్ ట్యాక్స్ దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలోనే బుధవారం ఉదయం నుండి సోదాలు నిర్వహిస్తోంది.
హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్న ప్రధాన కార్యాలయంతో పాటు కీసరలో 28 ఎకరాలలో నిర్మించిన భారీ భవన సముదాయాలు, సోమాజిగూడలోని హైదరాబాద్ కార్యాలయం, డైరెక్టర్లు, కీలక ఉద్యోగుల నివాసాల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు చేపట్టారు.
పేద కుటుంబంలో పుట్టి డ్రైవర్ గా జీవితాన్ని ప్రారంభించిన శౌరెడ్డి బాలవికాస సంస్థను ఏర్పాటు చేసి సేవ పేరుతో విదేశీయులను నమ్మించి వారి నుండి పెద్దమొత్తంలో డొనేషన్ల రూపంలో నిధులు రాబడుతూ కోట్లకు పడగనెత్తినట్లుగా ఆరోపణలున్నాయి.
మొత్తంగా ఇప్పటివరకు సంస్థ ద్వారా యాభై మిలియన్ అమెరికన్ డాల్లర్లను కూడబెట్టినట్లుగా తెలుస్తోంది. ఇందులో ఎన్ని వందలకోట్లు దారి మళ్ళించాడనే విషయం తేలాల్సి ఉంది.