ఆదాయపు పన్ను చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడిందన్న అనుమానంపై హైదరాబాద్ లోని ఎక్సెల్ గ్రూపు కంపెనీపై ఐటీ దాడులు ప్రారంభమయ్యాయి. నగరంలోని గచ్చిబౌలిలో గల ఈ సంస్థ ప్రధాన కార్యాలయంతో సహా మైండ్ స్పేస్ సమీపంలోని ఎక్సెల్ రబ్బర్ లిమిటెడ్ కంపెనీలో కూడా గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య బుధవారం ఉదయం నుంచే వీటిని ప్రారంభించారు.
20 బృందాలుగా విడిపోయి.. సుమారు 60 మంది సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొంటున్నారు. చెన్నై ప్రధాన కేంద్రంగా గల ఎక్సెల్ గ్రూపు సంస్థపై గతంలోకూడా ఐటీ అధికారులు దాడులు జరిపారు.
ఇక హైదరాబాద్ లోని బాచుపల్లి, చందానగర్ లో సైతం ఈ రెయిడ్స్ కొనసాగిస్తున్నారు. ఎక్సెల్ గ్రూపు.. ఇన్ ఫ్రా , ఐటీ గ్రూపు , ఇంజనీరింగ్ హెల్త్ కేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలను నిర్వహిస్తోంది. హైదరాబాద్ సహా దేశంలోని 18 చోట్ల దాడులు ప్రారంభించినట్టు ఐటీ వర్గాలు తెలిపాయి.
తెల్లవారు జామున ఆరు గంటల నుంచే ఈ దాడులు, తనిఖీలు కొనసాగుతున్నాయి. లెక్కల్లో చూపకుండా ఇన్కమ్ టాక్స్ ఎగగొట్టారని అందిన సమాచారం మేరకు వీటిని కొనసాగిస్తున్నారు.