తమిళనాడు వ్యాప్తంగా శుక్రవారం ఐటీ అధికారులు 40 లొకేషన్లలో దాడులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి సెంథిల్ బాలాజీ ఇంటిపైన, ఆయన కార్యాలయం పైన, చెన్నైతో బాటు కరూర్ .ఇతర చోట్ల ఆయనకు సంబంధించిన ఆస్తులపై సోదాలు జరుగుతున్నాయి. వీటిని అడ్డుకోవడానికి డీఎంకే కార్యకర్తలు ప్రయత్నించడంతో స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. కరూర్ జిల్లా లో సెంథిల్ సోదరుడు అశోక్ కు చెందిన కార్యాలయం పై రెయిడ్ జరిపేందుకు వచ్చిన ఓ మహిళా ఐటీ అధికారి పట్ల డీఎంకే కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించారు.
చెన్నై, కరూర్, కోయంబత్తూరు తదితర చోట్ల సెంథిల్ బాలాజీకి చెందిన ఆస్తులు ఉన్నాయని, ఏకకాలంలో వీటిపై దాడులు నిర్వహిస్తున్నామని ఐటీ అధికారులు తెలిపారు.
ఇటీవలే రియల్ ఎస్టేట్ సంస్థ అయిన జీ స్క్వేర్ కార్యాలయం పై కూడా వీటిని నిర్వహించారు. కాగా-ఎక్సయిజు. ప్రొహిబిషన్ శాఖను కూడా నిర్వహిస్తున్న సెంథిల్ బాలాజీ ని కేబినెట్ నుంచి తొలగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై డిమాండ్ చేశారు.
విల్లుపురం, చెంగల్పట్టులో కల్తీ సారా తాగి కొందరు మరణించారని, ఈ ఉదంతంపై సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని, అందువల్ల నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలంటే ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించాలని అన్నామలై కోరారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కంపెనీలు కొన్ని అక్రమాలకు పాల్పడుతూ ఆదాయపు పన్నును ఎగ్గొడుతున్నాయని ఆయన ఆరోపించారు.