– వంశీరాం బిల్డర్స్ పై ఐటీ దాడులు
– విజయవాడ, హైదరాబాద్ లో 15 చోట్ల తనిఖీలు
– ముందే అంచనా వేసిన తొలివెలుగు
– ఆగస్ట్ లోనే బీ రెడీ అంటూ వార్తలు
– వంశీరాంకి చేసిన మేలుపై ఇన్వెస్టిగేషన్ కథనం
– నిధుల మళ్లింపుపై ఈడీ ఫోకస్
– ఐటీ తర్వాత ఈడీ ఎంటర్?
క్రైంబ్యూరో, తొలివెలుగు:టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న ల్యాండ్ సెటిల్మెంట్స్.. దాని వెనకున్న డీలింగ్స్.. అన్నీ జనం ముందు ఉంచుతోంది తొలివెలుగు. అక్రమంగా అనుమతులు పొందడం.. పన్నులు చెల్లించకుండా నల్లధనాన్ని పోగుచేసుకోవడం.. ఇలా అక్రమదారుల్లో వెళ్తున్న వారి చిట్టాను ఎప్పటికప్పుడు బయటపెడుతూ ఉంది. ఈ క్రమంలోనే కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆయా కంపెనీలపై దృష్టి సారించాయి. తొలివెలుగు ఇస్తున్న ఇన్వెస్టిగేషన్ కథనాలు వాటికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
తొలివెలుగు ఇస్తున్న కథనాలు అన్నీ అరటిపండు తొక్క తీసి ఇచ్చినట్లు.. క్లియర్ గా ఉండడంతో దర్యాప్తు సంస్థలకు అంతా ఈజీగా అవుతోంది. వంశీరాం బిల్డర్స్ పై ఐటీ దాడులు ఉంటాయని ఆగస్ట్ 26న తొలివెలుగు ప్రచురించింది. ఆ తర్వాత ఎక్కడెక్కడ.. ఎలాంటి దందాలు చేశారో వివరించింది. ఒక్క వంశీరాం సంస్థే కాదు.. ఫినిక్స్, వాసవి, సుమధుర, సాహితీ లాంటి రియల్ ఎస్టేట్ కంపెనీల వ్యవహారంపై కథనాలు ఇచ్చింది తొలివెలుగు. ట్రస్ట్ ల ముసుగులో సేవ పేరుతో విద్యను, వైద్యాన్ని కార్పొరేట్ చేసిన స్టైల్ ని ఎండగట్టింది.
లిక్కర్ స్కాంలో ఏపీ ఎంపీ అల్లుడి వ్యవహారం మొదటిసారిగా బయటపెట్టింది తొలివెలుగే. ఇలా ఎన్నో సంచలన స్కాములకు సంబంధించిన లింకుల్ని ప్రజల ముందు ఉంచింది. పేదోడు గుడిసె వేసుకుంటే తెల్లారే కూలగొట్టే ప్రభుత్వం.. వందల కోట్ల విలువ చేసే భూములను అప్పనంగా అప్పగించి.. మళ్లీ బినామీల రూపంలో భవంతుల ద్వారా లబ్ది పొందుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటన్నింటిపై ఇప్పుడు దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి.
ఈక్రమంలోనే మంగళవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్తల ఇళ్లల్లో సోదాలు చేపట్టారు. జూబ్లీహిల్స్ లో కాంట్రాక్టర్ జనార్ధన్ రెడ్డి ఇంట్లో తనిఖీలు జరుపుతున్నారు. వంశీ రామ్ బిల్డర్స్ కార్యాలయం, జనార్ధర్ రెడ్డి ఇళ్లతో పాటు మొత్తం 15 చోట్ల ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు.