హైదరాబాద్‌లో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. నగరంలోని రియల్ ఎస్టేట్, ఫార్మా కంపెనీల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొత్తం 30 చోట్ల ఏకకాలంలో దాడులు చేస్తున్నారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ కొహినూర్ తో పాటు మరో రియల్ ఎస్టేట్ కంపెనీల్లో సోదాలు చేస్తున్నారు.
హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో కొహినూర్ కంపెనీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. ఒక రాజకీయ నాయకుడికి ఆ కంపెనీ బినామీగా వున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఆ కంపెనీ ప్రభుత్వ భూముల్లో వెంచర్లు వేసి వ్యాపారం చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు.
కొహినూర్ కంపెనీ ఎండీ మజీద్‌తో పాటు కంపెనీ డైరెక్టర్ల నివాసాల్లో ఈ రోజు ఉదయం నుంచే ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కంపెనీకి సంబంధించిన పత్రాలు పరిశీలించడంతో పాటు ఆదాయ వివరాలను ఆరాతీస్తున్నారు.
గత నెలల్లో చెన్నైకి చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ జీ స్క్వేర్ పై ఐటీ దాడులు జరిగాయి. కంపెనీకి సంబంధించి రాజధాని చెన్నైతో పాటు మొత్తం 50 ప్రాంతాల్లో ఐటీ సోదాలు చేసింది. ఈ సంస్థ దక్షిణ భారతదేశంలో పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేపట్టింది. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో వ్యాపారం చేస్తోంది.