– ముందే చెప్పిన తొలివెలుగు
– కూకట్ పల్లి భూముల వ్యవహారంలో ఐటీ ఎంట్రీ
– రూ.280 కోట్లతో రూ.2వేల కోట్ల బిజినెస్
– భయం గుప్పిట్లో బడా కంపెనీలు
– ఏకకాలంలో 10 బృందాల సోదాలు
– ఆర్ఎస్ బ్రదర్స్ సంస్థల్లో తనిఖీలు
– ఇప్పటికే వాసవి, సుమధుర, ఫినిక్స్ కంపెనీల్లో సోదాలు
– నెక్ట్స్ టార్గెట్ హానర్స్ సంస్థేనా?
హైదరాబాద్,తొలివెలుగు:నగరంలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. తొలివెలుగు ముందుగా చెప్పినట్లుగానే.. ఏకకాలంలో అధికారులు 10 బృందాలుగా సోదాలు చేపట్టాయి. బంజారా హిల్స్ తో పాటు పలు ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. నిన్నటి వరకు సీబీఐ, ఈడీ సోదాలు జరగగా తాజాగా ఐటీ అధికారులు కూడా రంగంలోకి దిగారు.
ఫినిక్స్ గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ కు సంబంధించిన భూముల వ్యవహారంలో ఈ దాడులు జరిగాయి. ఆర్ఎస్ బ్రదర్స్ యాజమాన్యానికి సంబంధించిన కంపెనీలపై సోదాలు జరిపారు. కేవలం 280 కోట్లు చెల్లించి 2 వేల కోట్ల బిజినెస్ చేస్తున్న వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న అధికారులు.. ఆ కోణంలోనే దాడులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వాసవి, సుమధుర, ఫినిక్స్ కంపెనీలపై సోదాలు నిర్వహించారు.
తాజాగా ఆర్ఎస్ బ్రదర్స్ కు సంబంధించిన కంపెనీలపై దాడులు జరిపారు. ఇప్పటికే ముగ్గురు చేతులు మారిన ఈ భూముల వ్యవహరంలో హానర్స్ కంపెనీకి కూడా చిక్కులు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ముంబైకి చెందిన ఆర్ఎస్ బ్రదర్స్ కి హైదరాబాద్ లోని భూముల వ్యవహారంలో లింకులు ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. నగరంతో పాటు మరికొన్ని ప్రాంతాలలో కూడా వారికి సంబంధాలు ఉన్నట్లు సమాచారం.
ఆర్ఎస్ బ్రదర్స్ రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టి వివాదాస్పద భూములు కొనుగోలు చేయడం వల్లే ఈ సోదాలు జరిపినట్లు సమాచారం. ఎకరాకు రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్లు పలికే భూములను హిందూజా సంస్థ నుంచి కేవలం రూ.10 కోట్లకే సొంతం చేసుకొని ఎక్కువ మొత్తంలో అమ్మడం ద్వారా అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.
కేవలం ఏడాదిన్నర కాలంలో వేల కోట్ల బిజినెస్ చేసినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. తాజాగా అల్లు అర్జున్ పేరుతో ప్రమోషన్ చేస్తున్న హానర్స్ కంపెనీ 150కి పైగా విల్లాలను నిర్మిస్తోంది. త్వరలోనే హానర్స్ హోమ్ పై కూడా ఐటీ దాడులు కొనసాగే అవకాశాలున్నట్లు సమాచారం.