హైదరాబాద్,తొలివెలుగు:మునుగోడు ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలోనే ఐటీ దాడులు జరుగుతున్నట్లు సమాచారం. బంగారం పంచిపెడతామని ప్రచారం చేయడంతోనే బంగారం దుకాణాల మీద ఐటీ రెయిడ్స్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో వాసవి, సుమధుర, ఫినిక్స్ లాంటి కంపెనీలతో లింకులు ఉన్న ఆర్ఎస్ బ్రదర్స్ ఆ కంపెనీల ద్వారా భారీ ఎత్తున డబ్బులు సంపాదించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇప్పుడు బంగారం రూపంలో మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఖర్చు చేస్తున్నట్లు తెలియడంతోనే ఐటీ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అక్రమంగా సంపాదించిన డబ్బుతో పాటు, కూడబెట్టిన డబ్బును మునుగోడు ఉప ఎన్నికలకు తరలించేందుకు ఆర్ఎస్ బ్రదర్స్, బిగ్ సీ తో పాటు మరిన్ని కంపెనీల వద్ద డబ్బు ఉన్నట్లు గుర్తించిన ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.
మునుగోడు ఉప ఎన్నికలలో ఇంటికి తులం బంగారం ఇస్తామని కొందరు నాయకులు హామీలు ఇచ్చిన నేపథ్యంలో వారితో సత్సంబంధాలు ఉన్న కంపెనీలపై ఐటీ ఫోకస్ పెట్టినట్లుగా ప్రచారం సాగుతోంది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తో పాటు మరిన్ని షాపింగ్ మాల్స్ లో కూడా పెద్ద ఎత్తున రైతుల పేరిట బంగారం కొనుగోలు బిల్లులను రూపొందించారు.
ఆధార్ కార్డు, పాన్ కార్డు లతో పాటు ఎటువంటి గుర్తింపు కార్డులు లేకుండానే బంగారం కొనుగోలు చేయడమే కాకుండా, బిల్లులను కూడా తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు.లోకల్ పోలీసు అధికారులు, టాస్క్ ఫోర్స్ అధికారులను కానీ, ఎవరినీ సంప్రదించకుండానే ఈ దాడులు నిర్వహించినట్లు టాక్. కేవలం అక్రమంగా నిధులను తరలించడం, బంగారాన్ని చేరవేయడం వంటి అంశాలనే తీసుకుని ఈ ఐటీ సోదాలు చేస్తున్నట్లు ఐటీ వర్గాల నుంచి విశ్వసనీయ సమాచారం.