ఢిల్లీ, ముంబై నగరాలలోని బీబీసీ కార్యాలయాల్లో ఐటీ ‘సర్వేలు’ ముగిశాయి.. మూడు రోజులపాటు.. సుమారు 60 గంటల పాటు నిర్వహించిన ఈ దాడులు ముగిసినట్టు ఐటీ ప్రకటించింది. ఈ సుదీర్ఘ దాడుల అనంతరం బీబీసీ స్పందిస్తూ ..ఈ రెండు సిటీల్లోని తమ కార్యాలయాల నుంచి ఐటీ అధికారులు సోదాలు ముగించుకుని వెళ్లిపోయారని, వారికి తాము ఎప్పుడూ సహకరిస్తూనే ఉంటామని పేర్కొంది. తమ సిబ్బందికి అండగా ఉంటామని, ఈ సర్వేల సందర్భంగా కొంతమందిని అధికారులు చాలాసేపు ప్రశ్నించారని, వారి ల్యాప్ టాప్ లను స్కాన్ చేశారని, మరి కొందరి మొబైల్ ఫోన్లను సీజ్ చేశారని పేర్కొంది.
కొంతమంది రాత్రుళ్ళు కూడా ఆఫీసులోనే ఉండాల్సి వచ్చిందని, కానీ వారంతా అధికారులకు పూర్తిగా సహకరించారని వివరించింది. మా కార్యకలాపాలు తిరిగి యధావిధిగా కొనసాగుతున్నాయి.. ఇండియాలోనూ, ఇతర దేశాల్లోనూ ఉన్న మా పాఠకులకు సమాచారాన్ని అందించేందుకు కట్టుబడి ఉన్నాం’ అని బీబీసీ తెలిపింది.
తమది విశ్వసనీయమైన, స్వతంత్ర మీడియా సంస్థ అని, నిష్పక్షపాతంగా సమాచారాన్ని అందించే తమ జర్నలిస్టులు, సహోద్యోగులకు సదా అండగా ఉంటామని పునరుద్ఘాటించింది.
అయితే సర్వేల పేరిట ఐటీ నిర్వహించిన సోదాలను, ఈ తరుణాన్ని పలు జాతీయ పత్రికలు తమ ఎడిటోరియల్స్ లో తప్పు పట్టాయి. ప్రతీకార చర్యల్లో ఇదొక ముందడుగు అని ఇండియన్ ఎక్స్ ప్రెస్ వ్యాఖ్యానించింది. టెలిగ్రాఫ్, ట్రిబ్యూన్ వంటివి కూడా వీటిని విమర్శించాయి. తనకు వ్యతిరేకంగా ఉండే వారిని మోడీ ప్రభుత్వం ఎలా వేధిస్తుందనడానికి ఇదొక నిదర్శనమని పేర్కొన్నాయి.