ఢిల్లీ, ముంబై నగరాల్లోని బీబీసీ కార్యాలయాల్లో వరుసగా మూడోరోజైన గురువారం కూడా ఐటీ ‘సర్వే’ లు కొనసాగుతున్నాయి. మూడు రోజులపాటు ఈ సర్వేలను నిర్వహించడానికి తమకు అనుమతి ఉందని ఐటీ అధికారులు బీబీసీ ఎడిటర్లకు స్పష్టం చేశారు. ఇప్పటివరకు అధికారులు దాదాపు 60 గంటలపాటు సోదాలు నిర్వహించారు. పన్నులు చెల్లించకుండా ఎగవేశారని వచ్చిన సమాచారంతో ‘సర్వే’లు నిర్వహిస్తున్నామని వీరు చెబుతున్నా.. ఈ వ్యవహారం అంతర్జాతీయ దేశాల దృష్టికి కూడా వెళ్ళింది.
ముంబై శాంతాక్రజ్ ప్రాంతంలోని బీబీసీ ఆఫీసులో ఐటీ అధికారులు చాలాసేపు అకౌంట్లను తనిఖీ చేశారు. ఇక తదుపరి నోటీసు ఇచ్చేంతవరకు బీబీసీ ఉద్యోగులంతా ఇళ్ల నుంచే పని చేయాలని ఆదేశించారు. పన్ను ఎగవేత ఆరోపణలకు సంబంధించి బీబీసీకి తాము గతంలోనే నోటీసులు జారీ చేశామని, కానీ వాటిని ఆ సంస్థ పట్టించుకోలేదని, తమకు సహకరించలేదని ఐటీ సిబ్బంది చెబుతున్నారు. తనకు వచ్చిన లాభాలను ఆ సంస్థ ఇతర సంస్థలకు మళ్లించిందని వారు ఆరోపిస్తున్నారు.
ఢిల్లీ, ముంబై సిటీల్లోని బీబీసీ కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల ఫోన్లను సీజ్ చేసిన అధికారులు వారి ల్యాప్ టాప్ లను స్కాన్ చేస్తున్నారు. గురువారం ఉదయం షిఫ్ట్ కు వచ్చిన సిబ్బందిని తిరిగి ఇళ్లకు వెళ్లిపోవలసిందిగా ఆదేశించారు.
నిన్న సర్వే నిర్వహించిన సందర్భంగా కొంతమంది ఉద్యోగులను ఎంపిక చేసి వారి నుంచి ఎలెక్ట్రానిక్ లేదా డాక్యుమెంట్లలో ఉన్న ఫైనాన్షియల్ డేటాను సేకరించారు. ఈ డేటాకు సంబంధించిన లావాదేవీలపై సిబ్బందిని ప్రశ్నించారు. ఉద్యోగులనుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లను వారికి తిరిగి ఇచ్చేస్తామని అధికారులు వెల్లడించారు. ఈ వ్యవహారాన్నంతా బ్రిటిష్ ప్రభుత్వ వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి.