దేశ వ్యాప్తంగా దిశ హత్య కేసు ఎంతటి సంచలనం రేపిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నలుగురు యువకులు అత్యంత దారుణంగా ఓ యువతిపై హత్యాచారం జరిపి ఆ పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. అయితే ఈ తరువాత నలుగురిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. కాగా ఈ ఘటన జరిగి సరిగ్గా నేటికి రెండేళ్లు అవుతుంది. నవంబర్ 28, 2019న రాత్రి ఒక వెటర్నటీ డాక్టర్‌ను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి ఆ తరువాత హత్య చేశారు నలుగురు దుండగులు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఒక్కరోజులోనే ఆ నలుగురిని పట్టుకున్నారు. 2019 డిసెంబర్ 6న ఆ కేసులో సీన్ రీ కన్స్ట్రాక్షన్ చేస్తుండగా పారిపోయేందుకు నిందితులు చెన్నకేశవులు, మహ్మద్ హారీఫ్, జొల్లు నవీన్, జొల్లు శివ ప్రయత్నించారు. ఆ సమయంలో వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా పోలీసులపై రాళ్లు రువ్వారు. ఆ సమయంలో పోలీసులు వారిని ఎన్కౌంటర్ చేశారు.
ఇక ఈ ఎన్కౌంటర్ పై నిందితుల కుటుంబాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు సిర్పూర్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కేసుపై రెండేళ్లుగా విచారణ సాగుతోంది. ఆదివారం కూడా ఎన్కౌంటర్ స్పాట్ వద్దకు కమిషన్ సభ్యులు రాగా జనాలు రోడ్డుపై బైఠాయించి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు.