చికాగో ఉద్యమంతో కార్మికుల చీకటి బతుకులు తొలిగిపోయి కాస్త స్వేచ్ఛగా బతుకుతున్నారని అన్నారు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. గతంలో రోజుకు 16 నుండి 18 గంటలు పనిచేస్తూ కన్న పిల్లల ముఖాలు కూడా చూడలేక పోయేవారని గుర్తు చేశారు. ఇప్పటికీ 12 గంటల పనిదినాలతో కార్మికుల కష్టాన్ని సొమ్ము చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తానని కేసీఆర్ చెప్పిన మాటలు నీటి మీది రాతలు అయ్యాయని విమర్శించారు. కనీసం వర్షం నీటితో అయినా పంటలు పండించుకోవాలనుకుంటున్న రైతులను వరిపంట వేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వరి వేస్తే ఉరి అనే కేసీఆర్ మాటల కారణంగా 20 లక్షల ఎకరాల్లో పంటలు వేయలేదని.. దీంతో అవి బీడు భూములుగా మారాయని అన్నారు.
బస్తాతో కలిపి 40.6 కేజీల కాంటా పెట్టాలని ప్రభుత్వం చెప్పినపట్టికీ.. కొనుగోలు కేంద్రాల్లో, మిల్లర్లు కొనుగోలు చేసే దగ్గర 42 నుండి 43 కేజీల వరకు పెట్టి రైతుల కష్టాన్ని సొమ్ము చేసుకుంటున్నారని మండిపడ్డారు. కనీసం గిట్టుబాటు ధర అయినా కల్పంచకుండా క్వింటాకు రూ.100 తక్కువ ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. అంత ఇంత అని మాటలు చెప్పడం కాదు.. గ్రౌండ్ లెవల్ లో ఏం జరుగుతుదో చూడాలని హితవుపలికారు.
మిషన్ భగీరథ డొల్లతనం ఎంతో ఈ ఎండాకాలం తేటతెల్లమైందన్నారు ఈటల. మళ్లీ పాత బావుల, బోర్ల నీళ్లే దిక్కు అయ్యాయని చెప్పారు. నీళ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నట్టు ఎన్ని వార్తలు వచ్చినా కేసీఆర్ కు బోదపడట్లేదని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో వారాల తరబడి నీళ్ళు రావడం లేదని.. 90 శాతం ఊర్లు మిషన్ భగీరథ నీళ్ళు అందక పాత నీటి ఆధారాల మీదనే కాలం గడుపుతున్నాయని పేర్కొన్నారు. కేసీఆర్ చెప్పేవన్నీ అదరగొట్టే మాటలు తప్ప కార్యాచరణ లేదని విమర్శలు గుప్పించారు రాజేందర్.