టీఆర్ఎస్ ప్రభుత్వం శిశుపాలుడిలా వంద తప్పులు చేసిందని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన కిసాన్ మోర్చా రైతు సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని కేసీఆర్ తప్పుల మీద తప్పులు చేస్తున్నారని ఆరోపించారు ఈటల.
నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం అన్నారు కదా..? వ్యవసాయమే గ్రామీణ ఆర్థిక జీవనం అని మాయమాటలు చెప్పారుకాదా..? అవన్నీ ఉట్టి మాటలేనా అని నీలదీశారు. కంప్యూటర్ యుగంలోనూ ప్రతీ మనిషికీ అన్నం పెట్టేది భూతల్లి మాత్రమే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని మండిపడ్డారు.
రాష్ట్రంలో ప్రజల సమ్యలను పరిష్కరించే బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం పరిష్కరించకుంటే ప్రజల తరపున కొట్లాడే హక్కు ప్రతిపక్షాలకు ఉందని గుర్తుచేశారు. ప్రజలు అధికారం ఇస్తే.. పాలన చేయడానికి చేతకాక రోడ్డెక్కి టీఆర్ఎస్ నేతలు ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఇరవై ఏళ్ల రాజకీయ జీవితంలో రాష్ట్రంలో అధికార పార్టీ దర్నాలు చేయడం మొదటిసారి చూస్తున్నాని అన్నారు. ఎన్ని చేసినా రానున్న రోజుల్లో తెలంగాణ గడ్డపై ఎగిరేది బీజేపీ జెండానే అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళలకు గౌరవం లేకుండా పోయిందని అన్నారు. ఎవరి జోలికీ వెళ్లని గవర్నర్ తో కొట్లాట పెట్టుకోవాలని ఎలా అనిపించిందని నిలదీశారు ఈటల.