కేంద్రం ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తూ.. సింగరేణిని ప్రైవేట్ పరం చేయడానికి కేసీఆర్ కుట్ర చేస్తున్నారని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జీఎం కాలనీ మైదానంలో జరిగిన సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం 27వ వార్షిక మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. సింగరేణిలో బొగ్గు బావుల పేరు మీద వేల కోట్ల రూపాయల గోల్ మాల్ జరిగిందని.. దాన్ని కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సింగరేణిలో టీఆర్ఎస్ అనుబంధ సంఘం పతనం మొదలైందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఈటల.
సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో కూర్చొని వ్యవస్థలను బ్రష్టు పట్టిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. సింగరేణిని ప్రైవేటుపరం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. ప్రైవేటు పరం కాకుండా అడ్డుకుంటామని.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.
సింగరేణి విషయంపై చర్చకు తాము సిద్దంగా ఉన్నామని.. దమ్ముంటే చర్చకు రావాలని సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. ముందుంది ముసళ్ల పండగ.. రానున్న రోజుల్లో సింగరేణి కార్మికులే టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్తారని అన్నారు ఈటల.