ఇటలీ కరోనా వైరస్ తో యుద్ధమే చేస్తోంది. ఈ యుద్దంలో శుక్రవారం ఒక్క రోజే రికార్డు సంఖ్యలో వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ ప్రబలినప్పటి నుంచి ఇంత పెద్ద సంఖ్యలో చనిపోవడం ఇదే మొదటిసారి. ఇది మున్ముందు మరింత తీవ్ర స్థాయికి చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
వైరస్ దేశంలోకి ప్రవేశించిన 5 వారాల తర్వాత ఇటలీలో రికార్డు స్థాయిలో 86,500 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం నాడు 44 మంది డాక్టర్లు చనిపోయారు. 6,500 మంది హెల్త్ వర్కర్లకు వైరస్ సోకింది. ఫీల్డ్ హాస్పిటల్స్ లో మిలిట్రీ డాక్టర్లు, నర్సులు వైరస్ తో పోరాడుతున్నారు. వారికి నా కృతజ్ఞతలు అని ఇటలీ రక్షణ శాఖా మంత్రి అన్నారు. ”యుద్ధం సుదీర్ఘమైనది..మనం ఇంకా చాలా చేయాల్సి ఉంది…మనందరం కలిసి పని చేస్తేనే విజయం సాధిస్తాం”అన్నారు. ఈ దారుణ పరిస్థితి అంతమయ్యే వరకు ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ సెంట్రల్, సధరన్ ఇటలీలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో ప్రజలు బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. గంట గంటకూ పరిస్థితి దారుణంగా మారుతుంది. డాక్టర్లకు ఇప్పుడు మానసిక స్థైర్యం కోసం మద్దుతు అవసరం అని ఒక డాక్టర్ అన్నారు.
వైరస్ వ్యాప్తి గురువారం నాడు 8.0 శాతం ఉండగా..శుక్రవారం నాటికి 7.4 శాతానికి తగ్గింది. లాక్ డౌన్ త్వరలోనే సత్ఫలితాల నిస్తుందని నేషనల్ హెల్త్ ఇనిస్టిట్యూట్ తెలిపింది. ” నేను ఒక్క విషయం స్పష్టంగా చెప్పగలను…సమస్య ఇంకా అంత తీవ్ర స్థాయికి చేరుకోలేదు” అని నేషనల్ హెల్త్ ఇనిస్టిట్యూట్ హెడ్ సిల్వియో బ్రుసఫెరో అన్నారు. ” వైరస్ తగ్గుముఖం పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి…మనం దగ్గరవుతామనే విశ్వాసం కలుగుతుంది” అన్నారు.