వయసు చిన్నదే. కాని టెస్టింగ్ టైమ్ వచ్చేసింది. అధికారం ఉన్నప్పుడు ఎలాగో నెట్టుకొచ్చేశారు. తండ్రికి తనయుడిగా గౌరవం దక్కింది. పార్టీలో, ప్రభుత్వంలో హవా నడిపించారు. కాని జనంలో ఇమేజ్ మాత్రం రాలేదు. అప్పటి ప్రతిపక్షం, ఇప్పటి అధికార పక్షం చేసిన క్యాంపెయిన్ తో ఆయన మాట్లాడుతుంటే జనానికి నవ్వు వస్తుంది గాని.. మాట్లాడేదేంటో పట్టించుకోరు.
తెలుగుదేశానికి ఆయనే ఇప్పుడు ఏకైక దిక్కు . నాయకుడు చంద్రబాబు తర్వాత బాధ్యతలను భుజాన వేసుకుని నడిపించాల్సింది ఆయనే. పార్టీలో నాయకులకు నమ్మకం కాస్తో కూస్తో ఉన్నా.. జనంలో మాత్రం రాలేదు. ఈ పరిస్ధితిని మార్చాలని నారా లోకేష్ విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ట్విట్టర్ కే కొంతకాలం పరిమితం అయిన లోకేష్.. ఇప్పుడు మెల్లగా జనంలోకి వెళ్లడానికి సందర్భాలను వెతుక్కుంటున్నారు.
తెలుగుదేశానికి చంద్రబాబు తర్వాత ఎవరు అనే ప్రశ్న ఉదయించగానే, లోకేష్ పేరు వస్తుంది. కాని లోకేష్ కు అంత సామర్ధ్యం లేదనే మాట కూడా దాని వెనుకే వస్తుంది. అసలందుకే ఇక పార్టీకి ఫ్యూచర్ లేదని చాలా మంది సర్దేసుకుంటున్నారు. ఒకవైపు బిజెపి, మరోవైపు వైసీపీ పోటీపడి మరి ఎమ్మెల్యేలను లాగేస్తున్నారు. బిజెపి ఎమ్మెల్యే సోము వీర్రాజు టీడీపీ ఖాళీ అయిపోతుందని అన్నా.. నమ్మే పరిస్ధితి వచ్చేసింది.
రాజకీయాల్లో ఆరితేరిన చంద్రబాబు వయోభారం పడుతున్నా గాని, పార్టీ రథాన్ని లాగడానికి, క్యాడర్ ను నిలబెట్టుకోవడానికి చేయని ప్రయత్నం లేదు. కాని వాటికి అంతగా ఫలితం ఉండటం లేదు. పైగా చెప్పిందే చెబుతూ ఆయన చేస్తున్న ప్రసంగాలు జనానికే కాదు, క్యాడర్ కు కూడా నచ్చటం లేదు. అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రతిపక్షంలోనూ.. ఒకే ఫార్ములా ఫాలో అవుతున్నారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఆయన ఏదో మాట్లాడినట్లు మీడియాలో రావాలనే తాపత్రయం అలాగే కొనసాగుతుంది. కాని అది ఇప్పుడు వికటిస్తుంది గాని, ఉపయోగం లేదనే విషయం ఆయనకు చెప్పే ధైర్యం ఎవరూ చేయలేకపోతున్నారు.
అందుకే చినబాబు రంగంలోకి దిగి, పూర్తి బాధ్యతలు చేపడితే తప్ప.. పార్టీ కొనసాగుతుందనే నమ్మకం జనాలకు రాదని సీనియర్ నేతలు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. గోదావరి వరదల సమయంలో ఆ జిల్లాల్లో లోకేష్ పర్యటించారు. ఆ తర్వాత ఇప్పుడు ఇసుక సమస్యపై పార్టీ ఆందోళనలు చేస్తున్న సమయంలో.. ఆత్మహత్యలు చేసుకున్న నిర్మాణ రంగ కార్మికుల ఇళ్లకు వెళ్లి, వారి కుటుంబాలను పరామర్శించే పనిలో పడ్డారు.
ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టకుండా.. కేవలం ట్విట్టర్ లోనే విమర్శలు చేస్తున్నారు లోకేష్. ఇది ఇలాగే కొనసాగితే కష్టమని టీడీపీ నేతలే అంటున్నారు. ట్విట్టర్ లో పెట్టింది కేవలం టీవీ ఛానెళ్లలో స్క్రోలింగ్ కే పరిమితం అవుతుంది.. అది కూడా తమకు మద్దతిచ్చే చానెళ్లలోనే వస్తుంది. మిగతావారు పట్టించుకోరు. ట్విట్టర్ పోస్టింగ్స్ అన్ని పెట్టే బదులు.. కనీసం వారానికి ఒకసారైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి.. మాట్లాడాలని అంటున్నారు. అయితే మాట్లాడేటప్పుడు గతంలోలా తప్పులు మాట్లాడితే మళ్లీ నవ్వులపాలు అవుతామనే భయం కూడా ఉంది.
అధికారం ఉన్నప్పుడు, ఏం చెప్పినా చెల్లుతుందని.. లీడర్ గానే ఫీలవుతామని.. కాని అధికారం లేకపోతే.. ఎవరూ లెక్క చేయరని.. మొహం కూడా చూపించరని.. అసలు కీలకమైన నాయకుడినేనా అనే అనుమానం కూడా వస్తుందని.. ఈ ఆరు నెలల్లోనే లోకేష్ కు అర్ధమై ఉండాలి. అధికారం ఉన్నా లేకపోయినా.. పార్టీలోను, ప్రజల్లోను పట్టు రావాలంటే.. జనంలోనే తిరుగుతూ.. సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ అగ్రెసివ్ గా వెళ్లినప్పుడే లోకేష్ కు ఫ్యూచర్ ఉంటుందని, లోకేష్ కు ఫ్యూచర్ ఉంటేనే టీడీపీకి ఫ్యూచర్ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.