ప్రభుత్వంపై పోరాడుతూ… అవినీతిని ప్రశ్నిస్తూ… జనం కోసం నిలబడితేనే యువత ఆదరించేది. గెలిచినా, ఓడినా జనంతోనే ఉన్నాడు. ఓటమికి కృంగిపోలేదు…. మరింత పదునుగా జనం గొంతుకై ప్రశ్నించాడు. ఆయనే తీన్మార్ మల్లన్న. అందుకే నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానం నుండి అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించే స్థాయిలో ప్రజాధరణ పొందగలిగాడు.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, అధికార పార్టీతో పోరాటంలో పార్టీలకు ఎక్కువ శక్తి ఉంటుంది. అందులోనూ కాంగ్రెస్, బీజేపీలకు అన్ని రకాల శక్తులున్నాయి. ఆర్థికంగా, రాజకీయంగా బలమైన నేతలున్నారు. కానీ వారికి సాధ్యం కానిది తీన్మార్ మల్లన్నకు సాధ్యమయ్యింది. టీఆర్ఎస్ ను వణికించేలా మొదటి ప్రాధాన్యాత ఓట్లు తెచ్చుకొని, గెలుపు చేరువలో ఉన్నాడు.
తీన్మార్ మల్లన్న… ఇప్పుడు ఓడినా గెలిచినట్లే. ఎందుకంటే బీజేపీ, కాంగ్రెస్ లకు సాధ్యం కానిది తను చేసి చూపించాడు. నిత్యం ప్రజల కోసం నిలబడ్డాడు. కేసీఆర్ ప్రభుత్వంపై వాచ్ డాగ్ పాత్ర పోషించాడు. అవినీతిని ప్రశ్నించే క్రమంలో… కేసులను ఎదుర్కొన్నాడు. కేసీఆర్ కు మల్లన్న లొంగిపోయాడన్న వారు కూడా ఉన్నారు. కానీ అవేవీ తనను ఏమీ చేయలేదు. మీడియా చేయాల్సిన పనిని తన సోషల్ మీడియా ద్వారా చేసి చూపించాడు. అందుకే… యూత్, నిరుద్యోగ యువత, ఉద్యోగుల్లోనూ తీన్మార్ మల్లన్నకు ప్రత్యేక అభిమానం దక్కింది. ప్రజల కోసం నిలబడితే డబ్బు అంశం వెనక్కిపోతుందని నిరూపించగలిగాడు తీన్మార్ మల్లన్న.
నిజానికి ప్రభుత్వ పెద్దల లొసుగులు బీజేపీ, కాంగ్రెస్ నేతలకు త్వరగా తెలుస్తాయి. ఆర్థికంగానూ వారు బలంగా ఉన్నారు. కానీ జనం వారిని నమ్మలేదు. ప్రశ్నించే గొంతుకగా తీన్మార్ మల్లన్నను ప్రత్యేకంగా చూశారు. ఒకరకంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి జనం మూడ్ ఎలాంటి వారి వైపు ఉంటుందన్నది ఈ ఎన్నిక ద్వారా బీజేపీ, కాంగ్రెస్ లకు మల్లన్న రుచిచూపించినట్లే.