పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు నగారా మోగింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పెరిగింది. ప్రస్తుతం అందరి దృష్టి మాత్రం బిహార్, మహారాష్ట్రలపైనే ఉంది. ఎన్డీఏ కూటమికి గుడ్ బై చెప్పి నితీశ్ కుమార్ ఆర్జేడీ, కాంగ్రెస్ లతో జతకట్టడం, శివసేన రెండుగా చీలిన తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో అందరూ ఆ రాష్ట్రాల వైపు ఆసక్తిగా చూస్తున్నారు.
బిహార్‌లో ఎన్డీఏ కూటమితో నిన్న, మొన్నటి దాకా నితీష్ కుమార్ చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. కానీ ఇటీవల ఎన్డీఏతో దోస్తీకి కటీఫ్ చెప్పిన నితీశ్ ఆర్జేడీ, కాంగ్రెస్ లతో కలిసి మహాఘట్ బంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన మొదటి రోజు నుంచే బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ రాగం అందుకున్నారు.
అప్పటి నుంచే అన్ని విపక్ష పార్టీలను కలుస్తూ ఒక తాటి పైకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఆయుధాల కేసులో మొకామా నియోజక వర్గ ఆర్జేడీ ఎమ్మెల్యే అనంత్ కుమార్ సింగ్ పై అనర్హత వేటు పడింది. మరో నియోజక వర్గం గోపాల్ గంజ్ బీజేపీ ఎమ్మెల్యే సుభాష్ ప్రసాద్ సింగ్ ఇటీవల మృతి చెందారు.
దీంతో ఆ రెండు నియోజవర్గాల్లో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ క్రమంలో ఎన్నికల్లో గెలిచి బీజీపీని తొలి దెబ్బ తీయాలని నితీశ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు బలమైన వ్యూహాలతో నితీష్‌కు ఝలక్ ఇచ్చేందుకు బీజేపీ కూడా రెడీ అవుతోంది.
ఇక మహారాష్ట్రలోని అందేరీలో ఎమ్మెల్యే రమేశ్ లాట్కే మరణంతో ఉపఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో శివసేన నుంచి ఏక్ నాథ్ షిండే వర్గం బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో శివసేన రెండుగా చీలిపోయింది. ఈ క్రమంలో బీజేపీపై శివసేన తీవ్ర ఆగ్రహంతో ఉంది.
ఈ క్రమంలో అందేరీలో గెలిచి ఠాక్రేను చావుదెబ్బ తీయాలని ఏక్ నాథ్ వర్గం, బీజేపీలు పావులు కదుపుతున్నాయి. అటు శివసేన కూడా మిత్ర పక్షాలు ఎన్సీపీ, కాంగ్రెస్ లతో కలిసి షాక్ ఇవ్వాలని చూస్తోంది. ఇప్పటికే ఆ నియోజక వర్గంలో లాట్కే భార్యను బరిలోకి దింపింది. ఆమెకు పోటీగా అభ్యర్థిని నిలబెట్టవద్దంటూ మిత్ర పక్షాలను అభ్యర్థించింది.