లోక్ సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ గెలిచేది ఎన్డీయే కూటమియే అని,ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి అయ్యేది నరేంద్ర మోడీయే అని ‘ఇండియా టుడే’ నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైంది. ప్రధానిగా మోడీ పని తీరు పట్ల 72 శాతం మంది సంతృప్తిని వ్యక్తపర్చడమే అందుకు కారణం. ‘మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్’ పేరుతో సీవోటర్ తో కలిసి ‘ఇండియా టుడే ‘ఈ సర్వే ను నిర్వహించింది.
ఇక సర్వేలో పాల్గొన్న వారిలో 67 శాతం మంది తొమ్మిదేళ్ల ఎన్డీయే పాలనపై సంతృప్తి వ్యక్తం చేశారు.ఆర్థిక అంశాలను, చైనా ముప్పును ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం బాగానే వ్యవహరించిందని వారు భావిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదికి పైగా సమయం ఉంది. అయితే ఇప్పుడే ఎన్నికలు జరిగితే భాజపా 284 స్థానాల్లో విజయం సాధిస్తుందని సర్వే అంచనా వేసింది.
కాంగ్రెస్ కి 191 స్థానాలు రావచ్చని తెలిపింది. అయితే ప్రధాని మోడీకి ఆదరణ ఏమాత్రం తగ్గలేదని ఇండియా టుడే అంచనాల్లో తేలింది. ఆయన పనితీరు పట్ల 72 శాతం మంది సంతృప్తి వ్యక్తపరిచారు. ద్రవ్యోల్బణం,కరోనా ప్రభావం, చైనా దురాక్రమణల ముప్పు వంటివి ఉన్నా ప్రజా వ్యతిరేకతను ఎన్టీయే సర్కార్ అధిగమించింది. మూడింట రెండొంతుల మంది ప్రజలు ప్రభుత్వం పై సంతృప్తితో ఉన్నారు. 2022 ఆగష్టులో 11 శాతం మంది మాత్రమే సంతృప్తితో ఉండడం గమనార్హం. ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్త పరిచినవారు అప్పుడు 37 శాతం ఉంటే ఇప్పుడు 18 శాతం మాత్రమే ఉన్నారు.
దేశంలో 1,40,917 మంది నుంచి అభిప్రాయాలను ఇండియా టుడే తెలుసుకుంది. మరో 1,05,008 మంది ఇంటర్వ్యూలను సివోటర్ అదనంగా తీసుకుంది. ఏ అంశాలను ఎన్డీయే విజయాలుగా భావిస్తున్నారనే ప్రశ్నకు 20 శాతం మంది ప్రజలు కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడం గురించి చెప్పారు. 370వ అధికరణం రద్దు గురించి 14 శాతం మంది, అయోధ్యలో రామ మందిర నిర్మాణ కోసం 12 శాతం మంది చెప్పారు.
జోడో యాత్రలోకాంగ్రెస్ జాతకం మారదని 37 శాతం మంది, ప్రజలతో విస్తృతంగా అనుసంధానం అయ్యేందుకు ఈ యాత్ర ఓ గొప్ప ప్రయత్నమని 29 శాతం మంది చెప్పారు. కాంగ్రెస్ పునరుజ్జీవానికి రాహుల్ గాంధీ తగిన వ్యక్తి అని 26 శాతం, సచిన్ ఫైలెట్ పేరును 17 శాతం మంది సమర్థించారు.