ఉత్తరాఖండ్‌లోని జ్యోషీమఠ్‌లో భూమి కుంచించుకు పోతోంది. దీంతో జ్యోషీమఠ్‌లో సుమారు 560 ఇండ్లకు పగుళ్లు వచ్చాయి. చాలా వరకు ఇండ్లు భూమిలోకి కుంచించుకు పోతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో జ్యోతిర్‌మఠంలో నిన్న ప్రజలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
ఆది గురువు శంకరాచార్యులు తొలి మఠాన్ని ఈ పట్టణంలోనే ఏర్పాటు చేశారు. ఆయన పేరు మీదుగానే ఆ ప్రాంతానికి జ్యోషి మఠ్ అని పేరు వచ్చింది. భూమి కుంచించుకుపోవడం వల్లే ఇండ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయని అధికారులు తెలిపారు.
29 కుటుంబాలను బుధవారం సురక్షిత ప్రాంతాలకు తరలించామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు మొత్తం 60 కుటుంబాలను తరలించినట్టు వెల్లడించారు. 500 కుటుంబాల వరకు ఇంకా జ్యోషీమఠ్‌లోనే ఉన్నాయని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు వివరించారు.
ఐఐటీ రూర్కీ నిపుణుల బృందం జ్యోషీ మఠ్‌లో పర్యటిస్తోందన్నారు. దీనిపై త్వరలో సీఎం పుష్కర్ సింగ్ ధామీకి నిపుణుల బృందం నివేదిక ఇస్తుందని వెల్లడించారు. ఈ ప్రాంతాన్ని త్వరలోనే సీఎం పుష్కర్ సింగ్ ధామీ పర్యటించి పరిస్థితిని అంచనా వేస్తారని పేర్కొన్నారు.
మార్వాడి, సింగ్‌ధార్ ప్రాంతాల్లో పగుళ్లు ఎక్కువగా వస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. బద్రీనాథ్ హైవే వద్ద ఉన్న సింగ్‌ధార్‌తో పాటు జేపీ కంపెనీ గేటు వద్ద ఉన్న ఇండ్లలో అత్యధికంగా పగుళ్లు సంభవించాయి. గంట గంటకు ఆ పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతున్నట్లు జోషీమఠ్ మున్సిపల్ చైర్మన్ వివరించారు.