లాక్ డౌన్ లో తమ స్వస్థలాలకు వెళ్లిపోవాలని వలస కార్మికులంతా నడకను, సైకిల్ ను ఎంచుకుంటున్నారు. కానీ ఆరోగ్యం సరిగ్గా లేని తండ్రితో 15 ఏళ్ల బాలిక ఢిల్లీ నుండి సొంత రాష్ట్రం బీహార్ కు వెళ్లేందుకు సైకిల్ మార్గాన్ని ఎంచుకుంది. వారం రోజుల్లో పగలు, రాత్రి అనే తేడా లేకుండా… 1200కి.మీ తండ్రిని ఎక్కించుకొని సైకిల్ తొక్కి ఔరా అనిపించింది. తండ్రిపై మమకారం, సొంతూరు వెళ్లాలన్న పట్టుదల ఆ బాలికను విజయవంతంగా ఇంటికి చేర్చింది.
ఇప్పటికే ఈ బాలిక సైకిల్ అద్భుతానికి భారత సైక్లింగ్ సమాఖ్య స్పందించింది. తను అద్భుత బాలికగా గుర్తించి, లాక్ డౌన్ ముగిశాక ఢిల్లీలో వసతి కల్పించి… తనకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని, సైక్లింగ్ లో భారత్ తరుఫున పాల్గొనేలా చూస్తామని ప్రకటించింది.
తాజాగా ఈ బాలిక సైకిల్ కథనం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ వరకు వెళ్లింది. దీనిపై స్పందించిన ఇవాంక… భారతీయుల ఆత్మగౌరవానికి, ఓర్పు, ప్రేమకు ఇది అద్ధం పడుతోందన్నారు. ఇది ఓ అద్భుతమని, సైక్లింగ్ సమాఖ్య దృష్టిని ఆకర్షించిందని ఇవాంక కొనియాడారు.