జగన్ మార్క్ టీటీడీ బోర్డు చూశాక కానీ ఐవైఆర్ కృష్ణారావుకి తత్వం బోధ పడలేదు. టీటీడీ ట్రస్ట్ బోర్డులో ఎన్నడూ భక్తి భావాలు కలిగిన వారు లేరట. భవిష్యత్‌లోనూ ఆధ్యాత్మిక భావన కలిగిన వారితో బోర్డు ఏర్పాటు అవుతుందన్న ఆశ కూడా ఐవైఆర్‌కు లేదట. ఈ విషయాన్ని ట్విట్టర్లో ప్రస్తావించారు. ఎంతో ఆవేదన చెందారు.
ఇంతకూ టీటీడీ కొత్త బోర్డు మీద ఐవైఆర్ ఇంత అత్యవసరంగా ఎందుకు స్పందించారంటే, నిన్న సోషల్ మీడియా వేదికగా చాలామంది డైరెక్టుగా ఐవైఆర్‌నే నిలదీశారు. నాన్‌లోకల్ వాళ్లకు, పైగా వివాదాస్పద వ్యక్తులకు టీటీడీ పాలకమండలిలో స్థానం కల్పించడమేంటని కడిగేశారు. ఆ పెద్దమనిషి ఎక్కడా అంటూ ఐవైఆర్ గురించి ఆరాతీశారు. బహుశా ఈ విషయం ఆయన వరకు వెళ్లి వుంటుంది. దాంతో ఐవైఆర్ టీటీడీలో ఇవన్నీ సహజమేలే అన్నట్టుగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో ఆయన వెలిబుచ్చిన అభిప్రాయం ప్రకారం సాక్షాత్తూ ఆ ఏడుకొండలవాడు కూడా దీనికి ఏమీ చేయలేడట. దీనికి ఒక్కటే పరిష్కారం ఉందని అంటున్నారు. అదేమంటే స్వామి వారిని కాపాడాలంటే ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయాలంట. దాని ద్వారానే దేవాలయాలకు ప్రభుత్వం నుంచి విముక్తి వస్తుందని, అప్పుడే శ్రీవారికి కూడా ముక్తి ఉంటుందని ఐవైఆర్ ట్వీట్.
టీటీడీ ట్రస్ట్ బోర్డులో 29 మందిని మేనేజ్ చేయడం చాలా కష్టమట. ఈవో పడే బాధలు వర్ణనాతీతమట. ఔను, ఇది నిజమే. తరతరాలుగా కుగ్రామంలోని గుడి నుంచి తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం వరకు ప్రభుత్వం, అధికార యంత్రాంగం పెత్తనం మితిమీరిపోయింది. హేతువాదుల నుంచి అన్య మతస్తుల దాకా స్వార్ధపరుల కన్ను హిందూ ఆలయ ఆస్తులపై పడుతోంది. మత విశ్వాసం లేనివారు కూడా గొప్పభక్తులమంటూ ఆలయ పదవుల కోసం అర్రులు చాస్తున్నారు. ప్రభుత్వం కోసం నిధులు దుబారా చేస్తున్నారు. ఇతర మతాల వారి విషయంలో వేలు పెట్టలేని సర్కార్ హిందూ మతంపై, ఆలయ ఆస్తులపై ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇదెక్కడి న్యాయం? ఇదెక్కడి చట్టం ? ఇదేమి ధర్మం ? ఐవైఆర్ చెప్పినట్లు వ్యాజ్యం ద్వారా ఆలయాలకు విముక్తి లభిస్తే ఎంతబాగుంటుంది.