జమ్ముకశ్మీర్‌లో రామ్ బన్ జిల్లాలో ఉత్తరాఖండ్ జోషిమఠ్ తరహా పరిస్థితి కనిపిస్తోంది. గోల్ పంచాయత్‌లోని దిక్సర్ ప్రాంతంలో భూమి కుంగిపోతోంది. ఉదయం 5 గంటల నుంచి భూమి కుంగుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో పది ఇండ్లు పూర్తిగా నేలమట్టం అయ్యాయి.
ఆ ప్రాంతంలోని పలు ఇండ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురువుతున్నారు. ఈ క్రమంలో అధికారులు అలర్ట్ అయ్యారు. స్థానికులను వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
తమ ఇళ్లు ధ్వంసం కావడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం నుంచి భూమి కుంగిపోవడం మొదలైందని అధికారులు చెబుతున్నారు. ఆ ప్రాంతంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఆ ప్రాంతంలో జనసంచారం లేకుండా చూస్తున్నామని అధికారులు చెప్పారు. రెండో రోజుల్లో భూ గర్భశాస్త్రవేత్తలు వచ్చి ప్రాంతాన్ని పరిశీలిస్తారని వెల్లడించారు. భూమి కుంగి పోవడానికి గల కారణాలను వారు అంచనా వేస్తారని, నిపుణుల నివేదిక అధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని అన్నారు.