హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్ లో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో జబర్దస్త్ లేడీ గెటప్ కమెడియన్ తన్మయ్ పట్టుబడింది. తన్మయ్‌తోపాటు మరో 8 మంది ఈవెంట్ ఆర్గనైజర్లు కూడా ఈ తనిఖీల్లో పట్టుబడ్డారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేశారు. తన్మయ్ సహా మొత్తం 30 మందిపై జూబ్లీ హిల్స్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు.
కరోనా నేపథ్యంలో గతంలో నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను నిర్వహించలేదు. అప్పట్లో లాక్‌డౌన్ కారణంగా తనిఖీలను పూర్తిగా నిలిపివేశారు. తరువాత ఆంక్షలను సడలించినప్పటికీ పూర్తి స్థాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను నిర్వహించడం లేదు. అయితే కరోనా కేసులు బాగా తగ్గుముఖం పట్టడం, కరోనా ప్రభావం దాదాపుగా పూర్తిగా తొలగిపోవడంతో పోలీసులు ఈ తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే మద్యం సేవించి పట్టుబడుతున్న చాలా మందిని పోలీసులు అరెస్టు చేస్తున్నారు.
కాగా గతంలో జబర్దస్త్‌కు చెందిన కమెడియన్ నవీన్ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డాడు. మద్యం సేవించి మొదటి సారి పట్టుబడితే రూ.10వేల జరిమానా, రెండో సారి పట్టుబడితే రూ.25వేల జరిమానా విధిస్తున్నారు. ఇక లైసెన్స్‌ను కూడా 3 నెలల వరకు రద్దు చేస్తున్నారు. అయితే పదే పదే హెచ్చరించినా పట్టించుకోని వారి డ్రైవింగ్ లైసెన్స్‌లను కూడా శాశ్వతంగా రద్దు చేస్తున్నారు.