ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సకాలంలో రావడం లేదన్న విషయం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు. ఈ సందర్బంగా ఆయన ఆదివారం అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగస్తులంటే ప్రజల్లో భాగమేనన్నారు. ప్రజాప్రతినిధుల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉద్యోగాలకు రాలేదని, కష్టపడి పరీక్షలు రాసి ఉద్యోగాలు సంపాదించుకున్నామన్నారు.
చట్టపరంగా తమకు రావల్సిన జీతభత్యాలు సమయానికి రావడంలేదన్నారు. ముఖ్యమంత్రి చెప్పినా ఇవ్వడం లేదని, దీంతో తాము రోడ్డున పడ్డామన్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి సందర్భాన్ని ఎదుర్కోలేదన్నారు. గతంలో ఏదైనా ఇబ్బంది వస్తే నాయకత్వానికి చెప్పి చేసేవారని, పండగలొస్తే రెండుమూడు రోజులు ముందుగానే వేతనాలిచ్చేవారన్నారు.
పీఆర్సీ కమిషన్ సమాచారం ఇచ్చినా ఇప్పటికీ డిపార్ట్ మెంట్ లకు పంపించలేదన్నారు. టీఏ, డీఏలనేవి ఎప్పుడో తీసేశారన్నారు. భారతదేశంలో ఏ ప్రభుత్వం అమలు చేయని పెన్షన్ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తున్నారని బొప్పరాజు విమర్శించారు.
తమకివ్వాల్సిన అలవెన్స్ లు, టీఏ, డీఏలు నాలుగు సంవత్సరాల నుంచి బకాయి పడ్డారన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. మూడేళ్లుగా కమిటీలు తప్ప ఫలితం లేదన్నారు జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు.