చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఆగ్రహానికి గురైన ఈ-కామర్స్ జెయింట్ అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌మా ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ప్రత్యక్షమయ్యాడు. రెండేండ్ల క్రితం జిన్‌పింగ్ సర్కార్‌ను విమర్శించినందుకు కష్టాలు కొని తెచ్చుకున్న జాక్‌మా ఇప్పుడు మెల్‌బోర్న్‌లో ప్రత్యక్షం కావడం ఆసక్తికర పరిణామం. ఒక ఆస్ట్రేలియా కుటుంబంతో ఆయన ఉన్నారని.. జాక్‌మా ఉన్న గ్రూప్ ఫొటోను ఉటంకిస్తూ చైనా మీడియా చెప్పుకొచ్చింది. జాక్ మా కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఒక ఫొటోలో ఆయన తన మొబైల్ ఫోన్ బ్రౌజ్ చేస్తూ.. కోక్ తాగుతున్నట్లు కనిపిస్తున్నది. ఇది మెల్‌బోర్న్‌లోని ఒక హోటల్‌లో తీసిన ఫోటో అని తెలుస్తున్నది.
దాదాపుగా నాలుగు దశాబ్దాలుగా మోర్‌లీ ఫ్యామిలీకి జాక్‌మాకు సంబంధాలు ఉన్నాయి. 1980వ దశకంలో జాక్‌మా భవిష్యత్ రూపకల్పనలో మోర్‌లీ కుటుంబం ప్రధాన పాత్ర పోషించింది. 40 ఏండ్ల క్రితమే అలీబాబా వ్యవస్థాపకుడి కోసం మోర్‌లీ కుటుంబం.. చైనాలోని జాక్‌మా సొంత పట్టణం హాంగ్‌జౌకు వచ్చేసింది. 1985లో తొలిసారి జాక్‌మాను ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్‌లో గల న్యూ కాస్టిల్‌కు ఆహ్వానించింది ఈ మోర్‌లీ ఫ్యామిలీ. 2017లో తన గురువు కెన్ మోర్‌లీ పేరిట 20 మిలియన్ డాలర్ల యూనివర్సిటీ స్కాలర్‌షిప్ ఫండ్ ఏర్పాటు చేశారు జాక్‌మా.
ఇంతకుముందు టోక్యోలోనూ జాక్‌మా ప్రత్యక్షం అయ్యాడు. టోక్యోలో ఉన్నంత కాలం జాక్ మా.. లో ప్రొఫైల్ జీవితం గడిపినట్లు తెలుస్తున్నది. చైనా నుంచి తన వ్యక్తిగత వంట సిబ్బంది, భద్రతా సిబ్బందిని టోక్యోకు తెచ్చుకున్నట్లు సమాచారం. టోక్యోలో వాటర్ కలర్ పెయింటింగ్స్‌తో జాక్‌మా కాలం గడిపాడని ఆయన సన్నిహితులు చెబుతారు. స్పెయిన్, నెదర్లాండ్స్ తదితర దేశాల్లోనూ జాక్‌మా కనిపించాడు.
2020 అక్టోబర్ 24న జరిగిన ఓ సమావేశంలో చేసిన వ్యాఖ్యలతో జిన్‌పింగ్ ప్రభుత్వానికి కంటిలో నలుసులా మారారు జాక్‌మా. చైనా అగ్రశ్రేణి నాయకులు, ఆర్థికవేత్తల సమక్షంలో జాక్‌మా మాట్లాడుతూ.. చైనా బ్యాంకులు కాబూలీవాలాల మాదిరిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నిధులు సమకూర్చేందుకు ఆస్తులు తాకట్టు పెట్టాలని బ్యాంకులు డిమాండ్ చేస్తున్నాయని, దీనివల్ల కొత్త టెక్నాలజీలకు నిధులు అందడం లేదని, ప్రయోగాలు నిలిపేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
చైనా పాలకులపైనా కూడా జాక్‌మా విమర్శలు చేశారని వార్తలొచ్చాయి. జాక్‌మా చేసిన విమర్శలు తన దృష్టికి రావడంతో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. పారిశ్రామిక రంగం నుంచి జాక్‌మాను అదృశ్యం చేయాలని తన అధికారులకు జిన్‌పింగ్ ఆదేశాలిచ్చారని తెలుస్తున్నది. మన తెలుగు సినిమా `ఆలీబాబా-40 దొంగలు`మాదిరిగా చైనా అధికారులు అలీబాబా ఫౌండర్‌పై దాడి చేశారని వార్తలొచ్చాయి.