‘‘పీఈటీ నిర్వాకం.. విద్యార్థినులకు నరకం’’ అని తొలివెలుగు ఇచ్చిన కథనానికి అధికారులు కదిలారు. విద్యార్థుల అవస్థను తెలుసుకుని సదరు పీఈటీపై చర్యలు తీసుకున్నారు. విధుల్లోంచి తొలగించినట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు.
వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం కావేరమ్మ పేట ప్రాంతంలో ఉన్న గురుకుల పాఠశాలలో విద్యార్థినులు రెండు జడలు వేసుకుని రాలేదని పీఈటీ శ్వేతకు కోపం వచ్చింది. ఒక్కో స్టూడెంట్ ని 150 వరకు గుంజీలు తీయాలని పనిష్మెంట్ ఇచ్చింది. ఎవరైనా మధ్యలో ఆపేస్తే మళ్లీ మొదటి నుంచి తీయించింది. దీంతో సుమారు 50 మందికి పైగా విద్యార్థునులకు కాళ్లు వాచిపోయాయి. తర్వాత ఒక్కొక్కరుగా అస్వస్థతకు గురయ్యారు.
విషయం తల్లిదండ్రులకు తెలియడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. పాఠశాల వద్దకు చేరుకొని పీఈటీ నిర్వాకంపై మండిపడ్డారు. అయితే.. ప్రిన్సిపాల్ కల్పన మాత్రం చిన్న విషయమే అంటూ దాటవేసేందుకు ప్రయత్నించారని తల్లిదండ్రులు తెలిపారు. గురుకులాల ఆర్‌ఎల్‌సీ జమీర్ అహ్మద్ కు విషయం తెలిసి.. పాఠశాలకు చేరుకుని పిల్లల పరిస్థితి చూశాక ఆయన కూడా అలాగే మాట్లాడారని వాపోయారు. బాధితులు తొలివెలుగుకు తమ గోడును వినిపించారు.
విషయం పెద్దదై ఉన్నతాధికారుల వరకు వెళ్లింది. దీంతో చేసేదిలేక పీఈటీ శ్వేతను విధుల్లోంచి తొలగిస్తున్నట్లు జమీర్ అహ్మద్ ప్రకటించారు.