పాలక, విపక్షాల రభసతో హాట్ హాట్ గా ఉంటున్న పార్లమెంట్ మంగళవారం కాస్త ‘చల్లబడింది’. ముఖ్యంగా రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ కర్ .. తన ఫన్నీ కామెంట్స్ తో అందర్నీ ఆకట్టుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాట, భారతీయ డాక్యుమెంటరీ చిత్రం ‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’ కి ఆస్కార్ అవార్డు లభించడంపై ప్రత్యేక ప్రస్తావన కింద సభలోని సభ్యులంతా హర్షం వ్యక్తం చేశారు. ఆస్కార్ విజేతలను తమిళనాడు ఎంపీ వైకో అభినందిస్తున్న సమయంలో ధన్ కర్.. ఒకవేళ తాను లాయర్ కాకుంటే యాక్టర్ ని అయ్యేవాడినని చమత్కరించారు. దీంతో సభలో నవ్వులు విరిశాయి.
ఆర్ఆర్ఆర్ సినిమా, ద ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ మన భారతీయ చలన చిత్ర సీమను విశ్వవ్యాప్తం చేశాయని.. . ఈ టీమ్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని ధన్ కర్ అన్నారు. . ఈ విజయాలు మన అత్యుత్తమ ప్రతిభను,క్రియేటివిటీని మన భారతీయ కళాకారుల అంకితభావాన్ని ప్రపంచ దేశాలు గుర్తించడానికి తోడ్పడ్డాయన్నారు.
భారతీయ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతర్జాతీయం కావడానికి ఇవే కారణమవుతున్నాయని ఆయన చెప్పారు. ద ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ.. ప్రకృతికి, మానవాళికి మధ్య ఉన్న అనుబంధాన్ని అత్యంత హృద్యంగా చూపితే.. నాటు నాటు పాట భారత డైనమిజాన్ని, ఎదురులేని శక్తిని ప్రతిబింబించిందని ధన్ కర్ వ్యాఖ్యానించారు.
ఆర్ ఆర్ ఆర్ టీమ్ ని, ద ఎలిఫెంట్ విస్పరర్స్ చిత్రాన్ని అభినందిస్తూ సభ్యురాలు జయాబచ్చన్ మాట్లాడుతున్న సమయంలో కొందరు సభ్యులు ఆమెకు అంతరాయం కలిగిస్తూ వ్యాఖ్యలు చేయడంతో ఆమె మండిపడ్డారు. అయితే ధన్ కర్ ఆమెను శాంతపరుస్తూ .. ప్రతిభ అన్నది మీ కుటుంబంలోనే ఉన్నదని వ్యాఖ్యానించారు. దీంతో జయాబచ్చన్ మరేమీ మాట్లాడలేకపోయారు.