తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు అధికార టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నాయని ఆరోపించారు విద్యుత్ శాఖ మంత్రి మంత్రి జగదీష్ రెడ్డి. సూర్యాపేట జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా బడుగుల లింగయ్య యాదవ్ నియమితులయ్యారు. అభినందన సభకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.
సీఎం కేసీఆర్ నిప్పులాంటి వ్యక్తి.. ఆయనను ముట్టుకుంటే భస్మం అవుతారని మంత్రి విమర్శించారు. కాళేశ్వరం కల సాకారం చేసిన నేత కేసీఆర్ అని కొనియాడారు. సంక్షేమం, అభివృద్ధిలో సంచలనాలు సృష్టించిన నాయకుడు అన్నారు. పైరవీలు, దందాలు చేసినోళ్లే ఊర కుక్కల్లా మొరుగుతున్నారని విరుచుకుపడ్డారు.
కేసీఆర్ మీద, ఆయన కుటుంబం మీద అవాకులు చెవాకులు పేలడం అంత మంచిది కాదని హెచ్చరించారు. 29 రాష్ట్రాలలో అతి చిన్న రాష్ట్రం తెలంగాణ అని.. అయినా సంక్షేమం, అభివృద్ధిలో పరుగులు పెడుతోందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ లేకుంటే 24 గంటల విద్యుత్ ఉండేదా? ఇంటింటికి మంచినీరు అందేదా? దళారులకు దోచి పెట్టడం వారితో అంట కాగడం తప్ప? అని నిలదీశారు.
బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ లో దారిద్ర్య రేఖ మరింత పెరిగిందని ఆరోపించారు. మోడీ పాలనలో దళారులు కుబేరులైనారని అన్నారు. దేశం దివాళా తీసిందని ఎద్దేవా చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీకి దిక్కు మొక్కు లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ నేతలకు తమ సొంత పార్టీకి నాయకుడు ఎవరో తెలియదని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.