మోడీ-కేసీఆర్ మధ్య జగన్ రాజీ !? - Tolivelugu

మోడీ-కేసీఆర్ మధ్య జగన్ రాజీ !?

ప్రధానితో కేసీఆర్ భేటి వెనుక ఆంతర్యం ఏమిటి? అదేరోజు జగన్ కూడా ఢిల్లీ వెళ్లడం మోడీతో సమావేశం కావడం యాదృచ్చికమా? లేక.. ఏదైనా రాజకీయ ప్రాధాన్యం ఉందా? ఈ చర్చ పొలిటికల్ సర్కిల్స్ బాగా నడుస్తోంది.

, మోడీ-కేసీఆర్ మధ్య జగన్ రాజీ !?

అటు కేంద్రంలో బీజేపీ, ఇటు రాష్ట్రంలో టీఆరెస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక బీజేపీకి టీఆరెస్‌కు గ్యాప్ బాగా పెరిగింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలవడం, కొన్ని ప్రాంతీయ పార్టీల నేతలను కలవడం, వారినందరిని ఒక వేదిక మీదకు తెచ్చే ప్రయత్నం చేయడం, వారికి ఎన్నికల ఖర్చులు కోసం వారికి ఆర్థిక సహాయం చేయడం వగైరా వగైరా చేయడంతో ఈ గ్యాప్ పెరిగిందని అంటుంటారు.

కాకపోతే, ఆ లోక్‌సభ ఫలితాలు కేసీఆర్ ఊహించుకున్న దానికి భిన్నంగా వచ్చాయి. తెలంగాణలో బీజేపీ అనూహ్యంగా నాలుగు స్థానాలు గెలుచుకుంది. దీనితో బీజేపీకి టీఆర్ఎస్‌కు మధ్య గ్యాప్ పెరిగింది. రెండు పార్టీల పరిస్థితి ఉప్పునిప్పులా తయారయ్యింది. తెలంగాణలో ఇక ముందు అధికారంలోకి వచ్చేది మేమే అంటూ రాష్ట్ర బీజేపీ నాయకత్వం పదేపదే ఘంటాపథంగా చెబుతోంది. టీఆరెస్‌కి ప్రత్యామ్నాయం మేమే అంటూ కమల దళం నేతలు రోజూ ప్రకటనలు చేస్తున్నారు. టీఆరెస్ సర్కార్ అవినీతిలో కూరుకుని పోయిందనేదే ప్రధానంగా వారు చెబుతున్న కారణం.

టీఆరెస్ మాత్రం బీజేపీ మీద ఆచితూచి ఎదురు దాడి చేస్తోంది. రాష్ట్ర బీజేపీ నాయకత్వం మీద ఎక్కువ దాడి చేస్తూ, కేంద్ర నాయకత్వం మీద అడపాదడపా పైపైన అలా అలా విమర్శలు చేస్తూ వస్తోంది. మరోవైపు ప్రధాని మోడీ అపాయింట్మెంట్ కోసం చాలా కాలంగా కెసీఆర్ ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాని కార్యాలయం రెస్పాండ్ కావడం లేదు. ఎట్టకేలకు కెసిఆర్‌కు ఇప్పుడు అపాయింట్మెంట్ దొరికింది. అదే సమయంలో ఏపీ సీఎం జగన్ కూడా ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వడం రాజకీయ చర్చకు కారణం అయ్యింది. కెసిఆర్‌-మోడీ మధ్య ప్యాచప్ చేసే బాధ్యత జగన్మోహన్‌రెడ్డి  ఏమైనా తీసుకున్నాడా అనే అనుమానం రాజకీయ వర్గాలలో వ్యక్తం అవుతోంది. అందుకే ఇద్దరికీ ఒకేసారి అపాయింట్మెంట్ ఇచ్చి ఉంటారని చర్చించుకుంటున్నారు.

, మోడీ-కేసీఆర్ మధ్య జగన్ రాజీ !?

ఇదిలా ఉంటే ఇటీవల కేసీఆర్-జగన్ భేటీలో ‘కేంద్రం వ్యవహరిస్తున్న తీరు, కేంద్రం పట్ల మనం అనుసరించాల్సిన విధానం, అవసరం అయితే కేంద్రానికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను కలుపుకొని పోతే ఎలా ఉంటుంది’ అనే అంశాలను చర్చించుకున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో మోడీతో ఢీకొనడం కష్టం.. ఇబ్బందులు వస్తాయి.. అని కెసిఆర్‌కు జగన్ చెప్పినట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. నాడు సీఎంల భేటీ తరువాత పత్రికలకు తెలంగాణ సీఎం కార్యాలయం అనధికారికంగా లీక్‌లు ఇవ్వడంతో కొన్ని పత్రికలు కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలిపై ఉభయులూ చర్చించారని, రాష్ట్రాల పట్ల చులకన భావంతో ఉందని భావిస్తూ కేంద్రం అనుసరిస్తున్న విధానానికి వ్యతిరేకంగా అవసరం అయితే కోట్లాదామని వారు మాట్లాడుకున్నారని వార్తలు ఇచ్చాయి. దీనిపై వెంటనే ఏపీ సీఎం కార్యాలయం పేరుతో అలాంటి చర్చ  ఏమీ జరగలేదని ప్రకటన ఇచ్చింది. కారణం తెలియదు కానీ, తెలంగాణ సీఎం ఆఫీస్ మాత్రం స్పందించలేదు.

నేను మోడీతో మాట్లాడి మన మధ్య గ్యాప్ పెరగకుండా చూస్తానని తరువాత జగన్ టీఎస్ సీయంతో చెప్పినట్లు సమాచారం. ఈ ఊహాగానాల మధ్య మోడీతో వీరి భేటీకి రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇది ఇలా ఉంటే వీరి మధ్య అవగాహన అంటూ కుదిరితే సీపీఐ పరిస్థితి ఏమిటీ.. అని పొలిటికల్ సర్కిల్స్‌లో జోకులు వస్తున్నాయి. బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా, కేంద్రం నిరంకుశ విధానాలకు అడ్డుకునేందుకు మేము సైద్ధాంతికంగా టీఆరెస్‌తో జత కట్టామని, అందుకే హుజుర్‌నగర్‌లో ఆ పార్టీకి మద్దతు ఇచ్చామని సమర్దించుకొని ఇరవై నాలుగు గంటలు కాకముందే కేసీఆర్ పోయి మోడీతో భేటి కానుండటంతో సీపీఐ మీద సెటైర్స్ వేస్తున్నారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp