విజయవాడ: రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏనాడూ నోరు మెదపలేదు. ఎన్నికల ముందుగానీ, ఆ తరువాత గానీ ఆయన ఆ పేరు ఎప్పుడూ ప్రస్తావించలేదు. రాజధాని శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ వచ్చినా ఆయన మాత్రం రాలేదు. ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వంటి వారు ఒకరిద్దరు ‘‘రాజధాని అమరావతిని మార్చం’’ అని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజధానిని మారుస్తారని ప్రజలలో అనేక అనుమానాలు ఉన్నాయి. దానిపై అనేక చర్చలు కూడా జరిగాయి. కానీ ఆ పార్టీ అగ్రనేత మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రాజధాని అమరావతిని మార్చం అనిగానీ, మారుస్తాం అని గానీ లేదా పలానా చోట నిర్మిస్తామని గానీ ఏనాడూ చెప్పలేదు. అంటే ఆయన దృష్టిలో ఏదో నిగూఢమైన ఆలోచన ఉన్నట్లు అర్ధమవుతోంది. అమరావతిని ఎవరు నిర్మించినా ఆ పేరు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్న అభిప్రాయం వారిలో ఉండే అవకాశం ఉంది. 2019-20 బడ్జెట్ లో కూడా అమరావతి నిర్మాణానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇతర పథకాలకు వేల కోట్ల నిధులు కేటాయించారు. రాజధాని మౌలిక వసతులకు రూ.500 కోట్లు, అమరావతి కాపిటల్ సిటీ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కు కేవలం రూ.50 కోట్లు కేటాయించారు. నిధుల కేటాయింపు వరుసక్రమంలో అమరావతికి 27వ స్థానం దక్కింది.
ప్రస్తుతానికి రాజధాని పనులు నిలిపివేశారు. ఆ పనులు చేసే కార్మికులు తమతమ ప్రాంతాలకు వెళ్లిపోయారు. రాజధానిని మరోచోటకు తరలిస్తారన్న ఊహాగానాలు వినవస్తున్నాయి. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపధ్యంలో ఈ ప్రభుత్వం అటువంటి ఆలోచన ఏదీ చేసే అవకాశంలేదని అంటున్నారు. అంతేకాకుండా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల సందర్భంలో మాట్లాడుతూ ఇంతటి వ్యయంతో రాజధాని నిర్మించే పరిస్థితుల్లో ప్రభుత్వంలేదని స్సష్టం చేశారు. మరో పక్క మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధానికి ఎంపిక చేసిన ప్రాంతం సరైనదికాదని పరోక్షంగా అర్ధం వచ్చే విధంగా మాట్లాడారు. అంతేకాకుండా తమ ప్రభుత్వం అమరావతిపై త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. దాంతో ఈ అంశం పతాక శీర్షికలకెక్కింది. ప్రజల్లో అనుమానాలు ఎక్కువయ్యాయి. అయితే ప్రస్తుత పరిస్థితులలో వారి పదవీకాలాన్ని రాజధాని నిర్మాణానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా కొనసాగించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.