ఏపీ రాజకీయాల్లో గౌతమ్ రెడ్డి ది కీలక పాత్ర అని అన్నారు ఏపీ సీఎం జగన్. నెల్లూరులో దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి సంస్మరణ సభలో ఆయన పాల్గొని నివాళులర్పించారు. గౌతమ్ రెడ్డి తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఒక్కసారి భావోద్వేగానికి గురయ్యారు జగన్. రాజకీయంగా తన ప్రతి అడుగులో గౌతమ్‌రెడ్డి తోడుగా ఉన్నారని చెప్పారు.
ఆయన మన మధ్య లేడనే వార్త చాలా కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం చెప్పలేనిదని.. రాజకీయాల్లో ఇద్దరం మంచి స్నేహితులుగా ఉన్నామని గుర్తుచేసుకున్నారు.
గౌతమ్ తననెంతో ప్రోత్సాహించేవారని తెలిపారు. ఆయనను తానే రాజకీయాల్లోకి తీసుకు వచ్చానని చెప్పారు జగన్. ఏపీ మంత్రి వర్గంలో పరిశ్రమల శాఖ సహా.. ఆరు శాఖలకు మంత్రిగా బాధ్యలు నిర్వహించారని తెలిపారు.
ఏపీకి పరిశ్రమలు తీసుకురావాలని గౌతమ్‌రెడ్డి తపన పడేవారని.. పరిశ్రమలు వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయనేవారని జగన్ చెప్పారు. మే 15 వరకు సంగం బ్యారేజీని పూర్తి చేసి.. గౌరవార్ధం ఆ బ్యారేజీకి ఆయన పేరును పెడతామని జగన్ తెలిపారు.