రైతు భరోసా పథకం కౌలు రైతులందరికీ కాదు, కొన్ని సామాజిక వర్గాలకే పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కౌలు రైతుల్లో కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే ప్రస్తుతం రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్టు సీయం జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.
గుంటూరు: రైతు భరోసా పథకం కౌలు రైతులు అందరికీ కాదని, కేవలం షెడ్యూల్ కులాలు, తెగలు, వెనుకబడిన, మైనారిటీ వర్గాలకేనని సీయం జగన్ క్లారిటీ ఇచ్చారు. అంటే, ఇతర సామాజిక వర్గాల్లో వుండే కౌలు రైతులు ఎవ్వరికీ రైతు భరోసా వర్తించదు. నిధుల లభ్యత అనుగుణంగా మిగతా వర్గాలకూ విస్తరించే అంశాన్ని భవిష్యత్తులో పరిశీలించనున్నట్టు తెలిపింది. ఓసీ వర్గం నుంచి ఎంతమంది ఉన్నారనే లెక్కలు నిర్దిష్టంగా లేకపోవటంతోనే ప్రస్తుతానికి బడుగు వర్గాల కౌలు రైతులకు మాత్రమే వర్తింపచేస్తున్నట్టు సీఎం జగన్ స్పష్టతనిచ్చారు.
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్ అధ్యక్షతన జరిగిన వ్యవసాయ మిషన్ సమావేశంలో రైతు భరోసా పథకానికి సంబంధించిన ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ధరల స్థిరీకరణ నిధి, రైతు భరోసా మార్గదర్శకాలతో పాటు వివిధ అంశాలపై ఈ మీటింగులో చర్చించారు. ఉభయ గోదావరి, రాయలసీమ ప్రాంతాల్లో ప్రధాన సామాజికవర్గాల నుంచి అధిక సంఖ్యలో ఉన్న కౌలు రైతులకూ భరోసా కల్పించాలని ఎమ్మెల్యేలు కోరుతున్న అంశం ఈ భేటీలో చర్చకొచ్చింది. దీన్ని పరిగణనలోకి తీసుకుని కౌలు రైతులందరికీ పథకాన్ని వర్తింపచేస్తే ప్రభుత్వంపై ఎంతో భారం పడుతుంది.ఆ సామాజిక వర్గాలకు సంబంధించిన కౌలు రైతులు ఎంతమంది వున్నారో గణాంకాలు సరిగ్గా లేదని చెప్పి అందరికీ వర్తింపచేయాలన్న అంశాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టాలని డిసైడయ్యారు.
కౌలు రైతుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వారికి మాత్రమే రైతు భరోసా వర్తింపచేయాలని ఇప్పుడు సీఎం తీసుకున్న నిర్ణయంపై నియోజకవర్గాల్లో ఎలాంటి స్పందన వుంటుందోనని అధికార పార్టీ శాసనసభ్యులు ఆందోళనతో వున్నారు.