దుబారా ఖర్చులంటూ చంద్రబాబు సర్కార్‌ను విమర్శించిన వైసీపీ అధినేత జగన్… ఇప్పుడు తాను కూడా అదే దారిలో పయనిస్తున్నారు.
సీఎం జగన్ తన హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ నివాసానికి రంగులు వేయడంతో పాటు చిన్న చిన్న రిపేర్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. దాదాపు 35.50లక్షల రూపాయలను విడుదల చేస్తూ రోడ్లు భవనాల శాఖ జీవో జారీ చేసింది. జగన్ తన లోటస్ పాండ్ నివాసానికి ఫెన్సింగ్, హైదరాబాద్ సచివాలయంలోని ఎల్ బ్లాక్ సీసీటీవీ కెమెరాల రీ ఇన్‌స్టాల్ చేసేందుకు ఇతరత్రా ఖర్చులకు ఈ నిధులు ఉపయోగించబోతున్నారు.
ఇక జగన్ తన తాడేపల్లి అధికార నివాసానికి ఇటీవలే నిధులు కూడా కేటాయించుకోగా… ఇప్పుడు సంవత్సరం పొడవునా ఉండే ఖర్చుల కోసం కోటి ఇరవై లక్షల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయటం గమనార్హం.
మంచినీళ్లు, అమరావతి రైతులకు డబ్బులు ఇచ్చేందుకు నిధులు లేవు… లోటు బడ్జేట్ అని చెప్పుకునే జగన్ సర్కార్ ఇలా ప్రభుత్వ ధనాన్ని తనకు మాత్రం యధేచ్ఛగా ఉపయోగిస్తుందని, ఇటీవలే జగన్ తన కూతురు అమెరికా ప్రయాణానికి తోడుగా వెళ్లిన అధికారుల ఖర్చును కూడా కోట్ చేస్తూ విమర్శిస్తున్నారు. జగన్ పేరుకు ఎన్నో నీతులు చెబుతూ… చేతల్లోకి వచ్చేసరికి మాత్రం అదే దారిలో పయనిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.