ఒక్క అవకాశం..! ఇది జగన్ ఎన్నికల నినాదం. ఆ ఒక్క అవకాశం ప్రజలు ఇవ్వడంతో జగన్‌కు అధికారం వచ్చింది. పాలన పూర్తిగా పారదర్శకం, అవినీతి రహితం, రాగద్వేషాలకు, పక్షపాతానికి అతీతం, ఓటేయని వారికీ ప్రభుత్వ పథకాల్లో అవకాశం…ఇది జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం తర్వాత చేసిన ప్రసంగం. అంతా బాగానే ఉంది. ఒక్క అవకాశం స్లోగన్‌తో అందల మెక్కిన జగన్ అదే ఒక్క రిక్రూట్‌మెంట్‌తో గ్రామ సచివాలయాల ద్వారా నిరుద్యోగులకు లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు సంకల్పించారు. పరీక్ష బాగా జరిపారు. పేపర్ చాలా టఫ్.. కాస్త మన అనుకునే వారికి వెసులుబాటు ఇవ్వాలని కొందరు కోరినా సీఎం ఏమాత్రం అంగీకరించలేదు. పైకి అంతా బాగానే ఉంది. తీరా రిజల్ట్స్ రిలీజ్ చేశాక అసలు సీన్ బయటపడింది. పేపర్ లీకేజ్ భారీ డ్యామేజీ చేసింది.
జగన్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునేందుకు మంచి అవకాశమున్న గ్రామ సచివాలయ పోస్టుల భర్తీ క్రెడిట్‌కు ఒక్కసారిగా పరీక్షా పత్రాల లీకేజీ అభియోగం తూట్లు పొడిచింది. ఆ పత్రిక కథనంలో ఏకంగా టాపర్ల ఉదాహరణలు, పేర్లు, వివరాలతో రాసింది. ఎప్పుడెప్పుడు చాన్స్ దొరుకుతుందా? అని ఎదురుచూస్తున్న టీడీపీ, బీజేపీలకు ఇది ఒక అస్త్రం.
ఐతే, వైసీపీ శిబిరం వైపు నుంచి కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పడేయటానికి, ఈ మెగా ఉద్యోగ భర్తీ విషయంలో కావాలనే ఏదైనా కుట్రకు పాల్పడి ఉంటారా? అనేది వైసీపీ అనుమానం.
ఏపీపీఎస్సీ క్రెడిబిలిటీ బాగానే ఉంది. వాస్తవానికి ఇలాంటిది ఏదో జరగవచ్చనే సందేహాలున్నప్పుడు పరీక్షపత్రాల రూపకల్పనను, వాల్యూయేషన్, ఫలితాల వెల్లడి బాధ్యతలను ఏదైనా యూనివర్శిటీకి ఇస్తే బాగుండేది. అనుమానం ఉంటె అలా చేస్తే బాగుండేది.
ఆ పత్రికలో వచ్చిన కథనం ప్రకారం లీకైన ప్రశ్నపత్రాలు చాలా ఒకరిద్దరికే కాకుండా చాలామందికి చేరినట్టుగా కనబడుతున్నది. ఏపీపీఎస్సీలో పనిచేసే కొందరు ప్రశ్నపత్రాలను తమ స్వార్థం కోసం, తమ బంధుమిత్రుల ప్రయోజనం కోసం ఉపయోగించుకున్నారని అనిపిస్తున్నది. ఈ విషయంలో సంస్థ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలమైనట్లే.
ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏం చేయబోతోందనేదే పెద్ద ప్రశ్నార్థకం!? ప్రస్తుతం విచారణకు సరే అంటే ఇప్పటిదాకా క్లెయిమ్ చేసుకుంటున్న ఘనతను ప్రభుత్వమే కొట్టిపారేసుకున్నట్టు అవుతుంది. ఇదంతా కుట్ర, దురుద్దేశం అని తోసిపుచ్చడం కూడా ఇంతదాక వచ్చాక సబబు కాదు. టీడీపీ క్యాంపు మీదకు ఎదురుదాడికి దిగడమా? కావాలని యెల్లో మీడియా ప్లస్, టీడీపీ క్యాంపు చేస్తున్న ప్రయత్నంగా ముద్ర వేయడమా? లేక పారదర్శకంగా అన్ని అనుమానాల్నీ నివృత్తి చేసే దిశలో చర్యలు తీసుకోవడమా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.
కానీ ఇక్కడ ఎదురుదాడికన్నా నిజంగా ఎక్కడ తప్పు జరిగిందో తేల్చడమే ముఖ్యం. ఎందుకంటే..? కొన్ని లక్షల అభ్యర్థుల కుటుంబాల్లో సందేహాల్ని రేకెత్తించింది ఈ కథనం. కానీ ఇక్కడ చూడాల్సింది ఇష్యూను, అసలు లీకేజీ ఏదీ లేదని తేలితే తప్పుడు కథనాలపై ఏం చేయాలనేది తరువాత ఆలోచన..!