అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం
భద్రత తొలిగించాం.. వీళ్ళను చంపుకోండి…!
◆ ప్రజాప్రతినిధుల ప్రాణాలకు విలువ లేదా..?
◆ ‘తొలగింపు’ బయటకు చెప్పటం ఎందుకు.?
◆ ముఖ్యమంత్రీ… మీకెందుకు అంత భద్రత..?
అప్పుడెప్పుడో జాతీయ పతాక సృష్టికర్త పింగళి వెంకయ్య మనవడు, పరిశోధన జర్నలిస్ట్, ‘ఎన్ కౌంటర్’ ఎడిటర్ పింగళి దశరథరాంను దారుణంగా చంపారు. ప్రాణం తీస్తారని.. భద్రత కోసం.. రక్షణ కోరుతూ.. ధర్నా టెంట్ లో ఉన్న వంగవీటి మోహన్ రంగాను అంతే దారుణంగా చంపారు. కాలచక్రం గిర్రున తిరిగింది. నాటి హంతకులంటూ… ‘నేరారోపణలు ఎదుర్కొన వారంతా అధికార ‘పంచన’ చేరారు’. దటీజ్ పాలిటిక్స్. ఎవడ్రా… ‘ఈ దేశంలో ఉన్న నాయకులు అంతా నీతిగా ఉన్నారు’ అని చెప్పింది. “ప్రత్యర్ధులను దర్జాగా చంపుకోండి… లైసెన్స్ ఇచ్చాం.. చూసుకోండి” ఆంటూ.. భద్రత విషయాలను అధికారుల ద్వారా తమ మాటలను.. భద్రత తొలిగింపు వార్తలను.. ‘ఎలా బహిరంగ’ పరుస్తున్నారు. ఇది ఏ నీతి. ఏ రాజకీయం. రాజకీయాల పదవీ కాలం ఐదేళ్లు. ఉద్యోగుల్లారా.. అదే ప్రత్యేకంగా పోలీసు ఉద్యోగుల్లారా.. మీ ఉద్యోగ జీవితం… ఐదేళ్ల కోసం తాకట్టు కాదు.. బలిపెడుతున్నారు. ఇదేనా మీ లక్ష్యం. ధ్యేయం. నింపాదిగా ఆలోచించుకోండి. తెలుగు రాష్ట్రాల నాయకుల భద్రతపై ప్రత్యేక కథనం.
‘విజయ’లో వీళ్ళు:
ఎస్‌ఆర్సీ (భద్రత సమీక్ష కమిటీ) సిఫార్సులను పోలీసులు అమలు చేశారు. నేతల స్థాయి, వారికి ఉన్న ముప్పును బట్టి నిర్ణయం తీసుకున్నారని చెపుతున్నారు. దీంతో కృష్ణాజిల్లాలోని పలువురు తాజా మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు అంగరక్షకులను తొలగించారు. మరికొందరికి కుదించారు. తాజా మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్రలకు పూర్తిగా రక్షణను తగ్గించారు. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకు మాత్రం అలానే ఉంచారు. గత శాసనసభ ఎన్నికలలో ఓటమి పాలైన బోడె ప్రసాద్, ఉప్పులేటి కల్పన, తంగిరాల సౌమ్య, శ్రీరాం రాజగోపాల్, కొనకళ్ల నారాయణ, జలీల్ ఖాన్, మండలి బుద్దప్రసాద్ తదితరులకు 1+1 విధానంలో ఉన్న గన్‌మెన్లను గతంలోనే తొలగించారు. బొండా ఉమామహేశ్వరరావుకు మాత్రం తగ్గించలేదు. ఎన్నికలలో విజయం సాధించినా గన్నవరం ఎమ్మెల్యే వంశీకి కుదించారు. ఎమ్మెల్సీ అయిన బుద్దా వెంకన్నకు సగానికి కుదించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు 1+1 మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు. ఎన్నికల కంటే ఏడాది ముందే మంత్రి పదవికి రాజీనామా చేసిన కామినేని శ్రీనివాస్‌కు ఇదే పద్ధతిలో ఇవ్వాలని సిఫార్సు చేశారు. అతను వద్దనుకోవడంతో ఇవ్వలేదు.
‘పుల్ల’గా వీడిన గన్‌మెన్లు:
గుంటూరు జిల్లాలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వద్ద ఉన్న ఇద్దరు గన్‌మెన్లు గత అర్థరాత్రి నుంచి కనిపించలేదు. మరో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు వద్ద ఒక్క గన్‌మెన్ మాత్రమే ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు గన్ మెన్ ను తొలిగించారు. ఒక్క మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకే కాదు.. అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలకు గన్ మెన్లను కుదించారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనికి ప్రస్తుతం 2+2 గన్‌మెన్లు ఉన్నారు. ఆమెకు 1+1 ఇవ్వాలని నిర్ణయించారు. అదేవిధంగా అంబటి రాంబాబు, పిన్నెలి రామకృష్ణారెడ్డి, కాసు మహేష్‌రెడ్డిలకు కొంత వరకు గన్‌మెన్లను తగ్గించనున్నారు.
‘అనంత’ బాధలు:
గతంలో అనంతపురం జిల్లాలో కొందరు నాయకులు మావోయిస్టుల జాబితాలో ఉన్న నేపథ్యంలో వారిపై పలుమార్లు దాడులు జరిగాయి. 2013 ఫిబ్రవరి 7న నక్సలైట్లు కుందిమద్ది సమీపంలో కాలవ శ్రీనివాసులు ప్రయాణిస్తున్న వాహనంపై క్లైమోర్ మైన్స్ పేల్చారు. అదృష్టవశాత్తు వాహనంలో ఉన్న నాయకులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన అనంతరం తెదేపా ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లో కూడా ఆయనకు భద్రత తగ్గించలేదు. తాజాగా ఆయనకు కూడా భద్రతను తొలగించారు. పరిటాల కుటుంబానికి క్రమక్రమంగా భద్రత తొలగిస్తున్నారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, మంత్రి, ప్రభుత్వ విప్ తదితర హోదాల్లో పనిచేసిన పల్లె రఘునాథరెడ్డి పాతికేళ్లుగా ప్రజాప్రతినిధిగా సేవలందిస్తున్నారు. వీరికి కూడా భద్రత తగ్గించారు. ఇప్పటికే సీనియర్ రాజకీయవేత్త జేసీ దివాకర్ రెడ్డికి తగ్గించారు.
భద్రత తగ్గిస్తే.. బహిరంగ పర్చాలా..:
ప్రభుత్వం భద్రత తగ్గించాలని భావిస్తే.. అది అంతర్గతంగా జరగాలి. ఇక్కడ అలా జరగలేదు.. సరికదా.. బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా అధికారులు చెప్పడం పూర్తిగా ఆక్షేపణీయం. వ్యవస్థ లోపాలతో ఏ ప్రజా ప్రతినిధి చేసిన పనిలో బాధితులు కక్ష్య గట్టి ప్రతీకారానికి ప్రయత్నిస్తే బాధ్యులు ఎవరు. ఉనికి కోసం ఏ తీవ్రవాది అయినా భరి తెగిస్తే… ఫలితం ఎలా ఉంటుంది.? జరిగితే బాధ్యులు ఎవరు..?
ముఖ్యమంత్రిగారూ..మీకేల అంత భద్రత.!:
ముఖ్యమంత్రిగా, ప్రజాప్రతినిధిగా మీరు కలకాలం ప్రజలకు సేవలందించాలి. భద్రత విషయంలో మీకు అవుతున్న ఖర్చు ఎక్కువే. తప్పదు. వాళ్ళల్లో తప్పులు చేసిన నాయకులు ఉండవచ్చు. ఆ తప్పులకు చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి పలు మార్గాలు ఉన్నాయి. మీలాగే ప్రత్యర్థి పార్టీ నాయకులవీ ప్రాణాలే.! తప్పదు. ఈ భద్రత విషయంలో జగన్ పునరాలోచించు కోవాలి. లేదంటే… బహిరంగంగా మీ ప్రభుత్వ అధికారులు ప్రకటించిన విధానం వల్ల ‘భద్రత తగ్గించాం.. ఇక చంపుకోండి’ అని ప్రకటించినట్లే.!
రేపు ఈ పరిస్థితి మీకు రాకూడదు..:
వీరంతా ఏ పార్టీలో ఉన్నా ‘బతుకు భద్రత’ ముఖ్యం. ఒక వేళ జరగరాని దారుణం జరిగితే బాధ్యులు ఎవరు.? ప్రభుత్వం ప్రజలందరి ప్రాణాలను కాపాడాల్సిన గురుతరమైన బాధ్యత ఉంది. ఈరోజు వీరు కూర్చున్న స్థానాలకు మీరు రావచ్చు. మీరు మాత్రం భయం, భయంంగా బతక కూడదనే లక్ష్యంతో ఈ కథనం.