ఏపీలో ప్రభుత్వం- న్యాయ వ్యవస్థ మధ్య పోరు మరింత ముదిరింది. ఇప్పటికే చీఫ్ జస్టిస్ మహేశ్వరి సహా పలువురు న్యాయమూర్తులపై సీఎం జగన్ స్వయంగా సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయగా… తాజాగా మరో జడ్జిపై తమకు నమ్మకం లేదంటూ ప్రభుత్వం అధికారికంగా అఫిడవిట్ దాఖలు చేసింది.
ఏపీ ప్రభుత్వం చేపట్టిన మిషన్ బిల్డ్ ఏపీపై దాఖలైన కేసును విచారిస్తున్న జస్టిస్ రాకేష్ కుమార్ ను విచారణ నుండి తప్పుకోవాలని కోరింది. ఆయన ఈ కేసును విచారిస్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం తమకు లేదని పిటిషన్ లో పేర్కొంది. కేసు విచారణలో భాగంగా రాష్ట్రంలో రాజ్యంగ వ్యవస్థలు దెబ్బతింటున్నాయని కామెంట్ చేశారని… ఆయనే ఈ కేసును వింటే తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని వాదించింది.
ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం… గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకించింది. కేసు విచారణ చేస్తున్న న్యాయమూర్తిపై నమ్మకం లేకుంటే విచారణ నుండి తప్పించమని కోరే అధికారం పిటిషనర్ కు ఉందని చెప్పటాన్ని ప్రస్తావించింది.