అమరావతిని రాజధాని ఎంపిక సమయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న ప్రభుత్వ వాదనను తోసిపుచ్చిన హైకోర్టు ఇన్ సైడర్ ట్రేడింగ్ లేదని తీర్పునిచ్చింది. సహాజంగానే ఈ తీర్పు జగన్ సర్కార్ కు రుచించదు. దీంతో ఈ తీర్పుపై అప్పీల్ కు వెళ్లాలన్న ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని చూపటం ద్వారా… కేవలం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులాగే అమరావతిని ముందుపెట్టి టీడీపీ నేతలు భారీగా అవినీతికి పాల్పడ్డారని చెప్పాలన్నది వైసీపీ, జగన్ వ్యూహాం. రాజకీయంగా పనికొచ్చే ఈ అవకాశాన్ని వదలకుండా పై కోర్టులో సవాల్ చేయాలని నిర్ణయానికొచ్చారు.
అయితే, ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదన్నది సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు. దీంతో ఈ తీర్పును డివిజన్ బెంచ్ లో సవాల్ చేయాలా…? లేదా నేరుగా సుప్రీంలోనే తేల్చుకోవాలా…? అన్న అంశంపై సర్కార్ మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. కానీ ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే పదమే చట్టాల్లో లేదని కోర్టు చెప్పినందున ఇందులో సీబీఐ దర్యాప్తు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. అయితే, ఈ అంశంపై మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తితో పరిశీలించాలని, తన అభిప్రాయం మేరకు ఎలా ముందుకు వెళ్లాలన్న నిర్ణయానికి రావాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
దీంతో కాస్త సమయం తీసుకోనైనా… హైకోర్టుకు బదులుగా సుప్రీంకు వెళ్లాలన్న ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది.