అవసరమొచ్చినప్పుడు ఒకలా.. అవసరం తీరాక ఒకలా అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది చంద్రబాబే. ఆయనపై ఈ విషయంలో ఉన్న ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. ఎన్టీఆర్, దగ్గుబాటి, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఇలా ఈ లిస్టు పెరిగిపోతూ ఉంటుంది. విలువలు, విశ్వసనీయత అంటూ, చంద్రబాబుకు అవి లేవంటూ విరుచుకుపడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నారా? అవుననే అనిపిస్తోంది.
అధికారం రాక ముందు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్న జగన్.. ఇప్పుడు రూల్స్ బ్రేక్ చేసేసుకుంటూ వెళుతున్నారు. ఏ మాటకా మాటే.. ఈ విషయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రం వేరు. ఆయన తనను నమ్ముకున్న మనిషికి ఏ పరిస్ధితిలో ఉన్నా సరే సపోర్టుగా నిలబడేవారు. ఆ లక్షణం జగన్ దగ్గర కూడా ఉంటుందనే నమ్మి చేరినవారు ఉన్నారు. వారిలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒకరు.
ఎన్నికల ముందు సడెన్ గా దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో చేరారు. ఆయన కుమారుడి కోసం టిక్కెట్ మాట్లాడుకున్నా.. అనుకోకుండా పౌరసత్వంలో టెక్నికల్ ప్రాబ్లెమ్ రావడంతో.. ఆయనే పోటీ చేయాల్సి వచ్చింది. వైసీపీలోనే ఉన్న ముఠాల కారణంగానే ఆయన ఓడిపోవాల్సి వచ్చిందని.. ఆయన వర్గం వాదిస్తోంది. ఎవరి వల్ల ఓడిపోయారో.. వారికి పదవులు ఇస్తూ.. దగ్గుబాటిని పట్టించుకోకపోవడంతో.. ఆయన షాకయ్యారనే చెప్పొచ్చు.
దగ్గుబాటి పురందేశ్వరి వైఎస్ హయాంలో కాంగ్రెస్ లో చేరి.. కేంద్ర మంత్రి అయ్యారు. సోనియాకు విధేయురాలుగా ఉంటూ.. జగన్మోహన్ రెడ్డి వైఖరిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఒక విధంగా దగ్గుబాటి దంపతులిద్దరు ఆనాడు కాంగ్రెస్ అధిష్టానానికి దగ్గరగా ఉంటూ.. జగన్ వర్గానికి వ్యతిరేకంగా పని చేశారు. కాని తర్వాత పరిస్ధితులు మారాయి. పురందేశ్వరి బిజెపిలో చేరారు. దగ్గుబాటి సైలెంట్ అయిపోయారు.
దగ్గుబాటి వైసీపీలో చేరగానే.. అందరూ వేసిన మొదటి ప్రశ్న మరి పురందేశ్వరి పరిస్ధితి ఏంటని. కాని ఆవిడ డారి వేరు, మా దారి వేరు అని సమాధానమిచ్చారు. అప్పట్లో వైసీపీ నేతలు కూడా దాన్నే సమర్ధించారు. కాని ఎన్నికల తర్వాత, జగన్ సీఎం అయ్యారు. సీఎం కావటం కోసం అందరినీ కలుపుకుపోవాలని.. ఈగోలు వదిలేయాలనే ప్రశాంత్ కిషోర్ సూత్రం ఫాలో అయి దగ్గుబాటిని దగ్గరకు తీసుకున్న జగన్.. ఆ తర్వాత మాత్రం తన అవసరం తీరిపోవటంతో దూరం పెట్టేశారు.
ఈ విషయం అర్ధం చేసుకోవడానికి పాపం దగ్గుబాటికే కాస్త సమయం పట్టింది. అదేమని నిలదీస్తే.. పురందేశ్వరి బిజెపి నుంచి వస్తే.. అప్పుడు అన్నీ ఆలోచిద్దాం అని సమాధానమివ్వడంతో మరింత అవాక్కయ్యారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. మామూలుగానే మాట పడని దగ్గుబాటి.. ఇలాంటి సందర్భాలు ఎదురైతే ఎమోషనల్ గా రియాక్టవుతారు. కేవీపీ విభజన సమయంలో తమను తప్పుదోవ పట్టించాడంటూ ఓపెన్ గానే తిట్టి.. ఆయనకు రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసేది లేదని ఖరాఖండిగా చెప్పిన మనిషి ఆయన. చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తే.. తట్టుకోలేక.. నెలలకే బయటికొచ్చేసిన నేత. అందుకే జగన్ వైఖరిని తట్టుకోలేకపోయారు. వెంటనే దూరం జరిగిపోయారు.
ఎన్నికలకు ముందు పేదరాశి పెద్దమ్మ కబుర్లు చెప్పిన జగన్, తర్వాత దగ్గుబాటిని దూరం పెట్టడం, వల్లభనేని వంశీలాంటివారిని దగ్గరకు తీయడం.. ఇవన్నీ చూస్తుంటే.. అధికారం వచ్చాక.. జగన్ వైఖరి మారిపోయిందని.. ఈయన కూడా చంద్రబాబుకు తీసిపోడనే కామెంట్లు వస్తున్నాయి.
తండ్రి ఇమేజ్ తోనే పై మెట్టు ఎక్కినా.. ఆయన స్వభావం మాత్రం ఒంటబట్టించుకోలేదని.. జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి