బీజేపీకి గుడ్ బై చెప్పి ఈ నెల 23న టీడీపీలో చేరబోతున్న ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అప్పుడే జగన్ సర్కార్ పై విరుచుకుపడడం మొదలు పెట్టారు. గన్నవరంలో టీడీపీ ఆఫీసు పై దాడిని ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత అరాచక పాలన మొదలైందని ఆరోపించారు.
గత ముఖ్యమంత్రులు రాష్ట్రంలో ఫ్యాక్షన్ నియంత్రించేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకున్నారని..జగన్ సీఎం అయిన తరువాత ఫ్యాక్షన్ సంస్కృతిని పెంచి పోషిస్తున్నారని కన్నా మండిపడ్డారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని విమర్శించారు. దీనికి పోలీసులు కూడా వంతనపాడుతున్నారని ఫైర్ అయ్యారు.
తన యాభ్భై ఏళ్ళ రాజకీయ అనుభవంలో ఏనాడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కళ్ల ముందే అరాచకం జరుగుతుంటే అడ్డుకోవాల్సిన పోలీసులు చేష్టలుడిగి చూస్తున్నారని ఆరోపించారు. అన్యాయం జరిగిందంటూ వచ్చిన వారికి న్యాయం చేయకుంటే పోలీసు వ్యవస్థపై బాధితుల మనస్సుల్లో కక్ష పెరుగుతుందని కన్నా చెప్పారు.
అధికారం ఎవరికీ శాశ్వతం కాదని ఆయన జగన్ సర్కార్ ను హెచ్చరించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ తో పాటు పోలీసులు కూడా గుర్తు పెట్టుకోవాలన్నారు. ప్రజలు తిరగబడిన రోజు ఏ పదవీ ఉండదని రాజకీయ నాయకులు గుర్తించాలని చెప్పారు.