ఎన్టీఆర్ రాష్ట్రంలో ఉత్తమ పాలనకు సృష్టికర్త అయితే..ఉత్తమ విధ్వంస కారుడు జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ కేంద్ర కార్యాలయంలో నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు భావితరాల భవిష్యత్తు కోసం ఎన్టీఆర్ తపించారన్నారు బాబు. నేడు బాధ్యత లేని విధ్వంసకారుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల భావితరాల భవిష్యత్తు కూడా నేడు గోదావరి పాలైందని మండిపడ్డారు. ఎన్టీఆర్ ఇచ్చిన ఆత్మగౌరవానికి ఆత్మ విశ్వాసం జోడించి ముందుకెళ్తే,ప్రపంచాన్ని జయించే శక్తి మన సొంతమని అన్నారు.
రాష్ట్ర భవిష్యత్తు పై నమ్మకం పోయినా.. తాజా పరిస్థితులపై ప్రజలు ఆలోచించాలన్నారు. జీవితాన్ని ప్రజలకు అంకితమిచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని, రాజకీయాల ద్వారా దేశానికి దశ దిశ నిర్థేశించిన నాయకుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు కొనియాడారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఈ ఏడాది జరుపుకోనుండటం ఓ అరుదైన అనుభవమన్నారు. సమాజంలో ప్రజల రూపంలో దేవుడిని చూసిన ఎన్టీఆర్ సిద్ధాంతం మరెవరికీ లేదన్నారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగా వ్యవహరించిన నిర్లక్ష్యం కారణంగానే కందుకూరు, గుంటూరులలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్నారు.
గుంటూరులో పంపిణీ సక్రమంగా జరగకుండా చావులు చూడాలన్న రీతిలో పోలీసులే కానుకలు విసిరేశారన్నారు. మఫ్టీలో ఉన్న పోలీసులే కొన్ని కానుకలు విసిరేసి జనం ఎగబడేలా చేసిన వీడియోలు తమ దృష్టికి వచ్చాయన్నారు. ఓటమి భయంతోనే అధికార పార్టీ పోలీసుల ద్వారా చావు కుట్రలు పన్ని జీవో నెంబర్ 1 తీసుకొచ్చిందని, ఆ జీవోను ప్రతిఒక్కరూ వ్యతిరేకించారని బాబు పేర్కొన్నారు.