కె.కె. ‘తొలివెలుగు’ ప్రతినిధి
సంబంధిత శాఖల మంత్రులెవరూ లేదు. అధికారులు అసలే లేరు. ఉన్నది కాంట్రాక్టర్లు.. వారితో కూర్చుని ఇద్దరు ముఖ్యమంత్రులూ రెండు నదుల అనుసంధానంపై అంత సుదీర్ఘంగా ఏం చర్చించారు ? దీనిపై అసలు జల వనరుల శాఖ మాజీ మంత్రి దేవినేని ఏమంటున్నారు?
గుంటూరు: రెండు తెలుగు రాష్టాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ దాదాపు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించిన అంశాలు ఏమై వుంటాయి. మంత్రులు కూడా సమావేశంలో లేరు. అధికారులు లేరు. మరి కీలకమైన నదుల అనుసంధానంపై సీయంలు ఏం మాట్లాడుకుని వుంటారు? అసలు ఈ భేటీలో ఏయే అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి.. ? దీనిపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కార్యాలయం నుంచి స్పష్టమైన వివరాలతో ఎటువంటి సమాచారం మీడియాకు ఇవ్వలేదు. కొన్ని ప్రధాన తెలుగు, ఇంగ్లీష్ పత్రికలు దీనిపై వార్తలు రాసినా.. ఒక్క ఈనాడు వార్తనే ఖండిస్తూ సీఎంవో కార్యాలయం నుంచి మాత్రం ప్రకటన వచ్చింది. అది కూడా టెలివిజన్ స్క్రోలింగ్స్ కోసం ఆయా రిపోర్టర్లు తమ సంస్థలకు పంపే సమాచారంలా వుంది తప్ప ఒక ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటనగా ఎక్కడా లేదు.
ప్రధానంగా ఇరు రాష్ట్రాల ప్రయోజనాలే లక్ష్యంగా ఈ సమావేశం సాగిందని చెబుతున్నారు. గోదావరి జలాల తరలింపు ద్వారా రాయలసీమకు, తెలంగాణలోని పాత మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు మేలు చేకూర్చే అంశంపై సుదీర్ఘ చర్చలు జరిగాయని ఏపీ సీఎంవో వర్గాలు వెల్లడించాయి. ఐతే అసలు గోదావరి జలాలపై చర్చ జరిగితే మరి రెండు రాష్ట్రాల నీటి పారుదల మంత్రులు.. అధికారులు ఎందుకు పాల్గొనలేదు.. వారు అవసరం లేదా అనేదే సామాన్యులకు కలిగే అనుమానాలు. ఈ అనుమానాలను మాజీమంత్రి దేవినేని నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. నిన్నటి సమావేశానికి ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి వెళ్లలేదని..మంత్రి చర్చలలో లేకుండా ఇద్దరు ముఖ్యమంత్రులు గోదావరి జలాలపై చర్యలు జరిపారని దేవినేని చెప్పుకొచ్చారు. అధికారులు, ఇంజినీర్లు ఎవరూ లేకుండా కాంట్రాక్టర్లలతో కూర్చొని నాలుగు గంటల పాటు చర్చించారని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికలకు ఇప్పుడే సమాలోచనలు మొదలు పెట్టారా.. అని దేవినేని ప్రశ్నించారు.
2020 నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని ఏజన్సీ చెప్పినప్పటికీ, జగన్ మాత్రం 2021 నాటికి పూర్తి చేయాలని చెప్పారని, ఇందులో వున్న మతలబు ఏంటని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని సీఎం కేసీఆర్ కోరడంతో దానికి జగన్ కూడా ఒకే చేశారని దేవినేని అంటున్నారు. ఇందులో నిజానిజాలేంటో జగన్ ప్రభుత్వం ప్రజలకు స్పష్టం చేయాల్సిన అవసరం కనిపిస్తోంది.