న్యూఢిల్లీ : ‘మీరు మాకు ఏదైనా చెప్పాలంటే.. నేరుగా చెప్పేయండి. మేము మీకు అన్నివిధాలుగా అనుకూలం. మధ్యలో కొందరు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చూడండి..’ అని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు విన్నవించినట్టుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి ఇటీవలే బీజేపీ తీర్థం తీసుకున్న రాజ్యసభ సభ్యుల గురించి జగన్మోహన్‌రెడ్డి ప్రస్తావిస్తూ ఇలా అన్నారని సమాచారం. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో జరిగిన భేటీలో జగన్ రాజకీయపరమైన ఒక అంశం గురించి వివరంగా మాట్లాడారు. సుజనాచౌదరి బీజేపీలో చేరినప్పటికీ.. ఆయన ఇంకా టీడీపీ మనిషేనని, అలాంటివారి మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించవద్దని జగన్ కేంద్ర మంత్రిని కోరినట్టు తెలిసింది. ‘ఈ పాత సైకిళ్ల గాలి తీసేయండి’ అని సీయం జగన్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ‘అలాంటివారి వల్ల ఉభయులకూ ఒరిగేదేం లేదు, నష్టం తప్ప..’ అని జగన్ అన్నట్టుగా విశ్వసనీయ సమాచారం.