రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో సంచలనం రేపిన వైయస్ వివేకా హత్య కేసును సీబీఐకి ఇవ్వాలనే పిటిషన్లపై ధర్మాసనం విచారణ జరిపింది. హత్య జరిగి ఏడాది గడుస్తున్నా ఇంత వరకు ఎటువంటి ఆధారాలు గుర్తించలేదని పిటిషన్ తరుపు న్యాయవాది కోర్ట్ కి తెలిపారు. సిట్ లు ఏర్పాటు చేస్తున్నారే తప్ప విచారణ సజావుగా జరగటంలేదని ఆరోపించారు. హత్య చేసి, రక్తపు మరకలు తుడిచి వేయటం వంటివి జరిగినా, మృతదేహాన్ని బాత్ రూమ్ లోకి తీసుకెళ్లినా అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు చెయ్యటం పట్ల ఇప్పటి వరకు కేవలం ముగ్గురిని అరెస్ట్ చేసారని, వారి నుంచి హత్యకు సంబంధించి ఎటువంటి సమాచారం పోలీసులు వెలికి తీయలేదని ఆరోపించారు.
కేసును తప్పుదారి పట్టించే విధంగా మృతుడి వద్ద ఉన్న సూసైడ్ లెటర్ ను కుమార్తె కు ఇచ్చారని, డ్రైవర్ ను ఉదయం రమ్మంటే గొడవపడి హత్య చేశారని ఆ లెటర్ లో ఉండటం చూస్తే కేసు పక్కదారి పట్టించటానికే వేరే వ్యక్తి ఇలా చేసారనేది న్యాయమూర్తి దృష్టికి పిటిషనర్ తరుపు న్యాయవాది తెలిపారు. ఇప్పటి వరకు డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేయలేదని కోర్ట్ కు తెలిపారు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ ఆ సమయంలో ఈ కేసు సీబీఐకి ఇవ్వాలని కోరారని, సీఎం అయ్యాక తన పిటిషన్ ఉపసంహరణ చేసుకున్నారని తెలిపారు. వేరే వాళ్ళ పిటిషన్ విషయాలు ప్రస్తావించవద్దని, తమ పిటిషన్ వరకు మాత్రమే మాట్లాడాలని న్యాయమూర్తి తెలిపారు. సీబీఐకి ఇవ్వటానికి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా, కౌంటర్ వేస్తారా అని ప్రశ్నించారు న్యాయమూర్తి. అభ్యంతరం లేదని కౌంటర్ వేయమని సిబిఐ తరుపు న్యాయవాది తెలిపారు.